"సినిమా అనేది నాకు స్వర్గం. అదే నాకు కావాల్సినంత ఎనర్జీని అందిస్తుంటుంది. అందుకే ఎప్పుడూ చిత్రీకరణలతో ఆ స్వర్గంలోనే సందడిగా గడపాలని కోరుకుంటా" అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. 'పటాస్' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే వెండితెరపై నవ్వుల పటాస్‌లు పేల్చి 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్ 2' చిత్రాలతో సినీప్రియులకు వినోదాలు పంచిన దర్శకుడాయన. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సోమవారం (నవంబరు 23) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ముచ్చటించారు.
పుట్టినరోజు జరుపుకోవడంపై మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
పుట్టినరోజు అనేది ప్రతి మనిషికీ ఎంతో ముఖ్యమైన రోజు. ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని సాధించగలుగుతున్నామంటే ఆరోజుకి కచ్చితంగా ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు గర్వపడే విజయాలు సాధించాలి.
ఇంతకీ ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి?
నాకీ పుట్టినరోజు చాలా స్పెషల్. ఈ ఏడాది నాకు చాలా ఆనందాల్ని పంచింది. 'సరిలేరు నీకెవ్వరు'తో విజయాన్ని అందుకున్నా. మా భార్య భార్గవి, పాప శ్రేయాశ్రీకి తోడుగా మా కుటుంబంలోకి అజయ్ సూర్యాంశ్ అడుగు పెట్టాడు. అందుకే ఈసారి పుత్రోత్సాహంతో పుట్టినరోజుని మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాను.
ఐదేళ్ల సినీ ప్రయాణంలో ఐదు విజయాలు. ఎలా అనిపిస్తుంది?
నిజంగా ఇది అదృష్టం. ప్రతి చిత్రం విజయవంతమవ్వాలనే కష్టపడతాం. కొన్నిసార్లు ఫలితం అటు ఇటు అవ్వొచ్చు. కానీ, నేను వరుసగా ఐదు విజయాలు అందుకొన్నా. దీని వల్ల దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించడమే కాక ఆర్థికంగా స్థిరపడ్డా. చాలా ఆనందంగా ఉంది.