తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సరిలేరు' కథ అక్కడ పుట్టింది.. విజయశాంతిని అలా ఒప్పించా - vijaya shanthi

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు దర్శకుడు అనిల్ రావిపూడి. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

'సరిలేరు' కథ అలా పుట్టింది.. విజయశాంతిని అలా ఒప్పించా
దర్శకుడు అనిల్ రావిపూడి

By

Published : Jan 8, 2020, 7:29 PM IST


ఇక్కడ మా సినిమాల్ని చూస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మరి బాలీవుడ్‌, హాలీవుడ్‌కు వెళ్లడం ఎందుకు? అని అంటున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. 'పటాస్‌', 'సుప్రీమ్‌', 'రాజా ది గ్రేట్‌', 'ఎఫ్‌ 2' వంటి హిట్లతో జోరుమీదున్న ఇతడు దర్శకత్వం వహించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. సూపర్​స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించారు. రష్మిక హీరోయిన్. సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అనిల్.. మీడియాతో ముచ్చటించాడు.

దర్శకుడు అనిల్ రావిపూడి

ఇంకా నవ్వుకుంటారు

"ఎఫ్‌ 2'తో ఎంత నవ్వుకున్నారో.. 'సరిలేరు నీకెవ్వరు'తో అంతకంటే ఎక్కువ నవ్వుకుంటారు. సంక్రాంతి భోజనం ఎంత రుచిగా ఉంటుందో ఈ సినిమా అలానే ఉంటుంది. నేను ప్రతి చిత్రానికి కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. మహేశ్‌బాబు నన్ను ఎంతో నమ్మి ఈ సినిమాలో నటించారు. 'ఎఫ్‌ 2' చేస్తున్నప్పుడే ఆయనకు స్క్రిప్టు చెప్పాను. నన్ను ఎంతగానో నమ్మారు కాబట్టి.. ఎంత కసితో, ఏకాగ్రతగా తీయాలో అలానే తీశా. కచ్చితంగా ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను'.

మహేశ్​బాబుతో దర్శకుడు అనిల్ రావిపూడి

25 నిమిషాలు కీలకం

ఈ సినిమా షూటింగ్‌ కేవలం ఐదు నెలల్లో పూర్తయింది. తొలుత వచ్చే 25 నిమిషాలు చాలా కీలకం. మహేశ్‌ సర్‌ తొలుత 40 నిమిషాలు స్క్రిప్టు విన్న తర్వాత నమ్మారు. కథలో మ్యాజిక్‌ ఉందని ఫీల్ అయ్యారు. మరికొన్ని రోజుల్లో షూటింగ్‌ ఉందనగా, అప్పుడు పూర్తి స్క్రిప్టు చెప్పా. తొలి నరేషన్‌కే ఆయనకు సినిమా డైలాగ్స్‌తో సహా మొత్తం గుర్తుండిపోయింది. ఇందులో హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఓ ఆర్మీ సైనికుడు సాధారణ సమాజంలోకి వచ్చినప్పుడు ఇక్కడి సమస్యలు అతడికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. 'బాధ్యత ఉండాలి కదా' అని ఫీలయ్యే పాత్ర. ఇది మహేశ్‌కు చాలా నచ్చింది. నేనూ ఆయన్ని తప్ప మరొకర్ని ఊహించుకోలేకపోయా.

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేశ్​బాబు

కథ అలా పుట్టింది

"సుప్రీం' సినిమా కోసం జోధ్‌పూర్‌ వెళ్లి తిరిగి రైలులో హైదరాబాద్‌ వస్తుండగా ఓ సైనికుడ్ని కలిశాను. ఆయనతో ఓ రోజు గడిపా. ఓ సైనికుడిలా కాకుండా ఎంతో సరదాగా జోక్‌లు వేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నాకు 'సరిలేరు నీకెవ్వరు' కథ తట్టింది. వాళ్లూ మనలాంటి మనుషులే.. ఎప్పుడు ఎలా ఉండాలో వారికి తెలుసు. అలా ఈ సినిమా కథ వచ్చింది. ప్రకాశ్‌రాజ్‌, విజయశాంతి, మహేశ్‌బాబు.. మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం. ముందుగా ఈ సినిమా కోసం జగపతిబాబును తీసుకున్నాం. కానీ ఓ సాంకేతిక సమస్య వల్ల ఆ స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నాం. వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని ఇలా చేయలేదు. ఇతర కారణాల వల్ల జగపతిబాబు సర్‌ తప్పుకున్నారు'.

'సరిలేరు నీకెవ్వరు' సినిమా పోస్టర్

అనవసరంగా కమిట్‌ అయ్యారు

'ప్రీ రిలీజ్‌ వేడుకలో కొరటాల శివ నన్ను మెచ్చుకున్నారు. అందరూ అనిల్‌లా పనిచేస్తే బాగుంటుంది అన్నారు. చిరు సినిమా షూటింగ్ 90 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పారు. ఆ రోజు కొరటాల శివ సర్‌ అనవసరంగా బుక్‌ అయ్యారు (నవ్వుతూ). ఐదు నెలల్లో సినిమా పూర్తి చేయడం అనేది సులభమైన పనికాదు. అన్నీ కలిసి రావాలి. నటీనటుల డేట్స్‌ కుదరాలి. వర్షాలు పడకుండా వాతావరణం అనుకూలించాలి. ఇలా ఎన్నో ఉంటాయి. అదృష్టవశాత్తు ఈ సినిమాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు'.

విలన్లు కూడా ఫన్‌గానే

'మహేశ్‌ వల్ల ఈ సినిమాలో కామెడీ పర్‌ఫెక్ట్‌గా కలిసిపోయింది. ఫన్‌, ఎమోషన్‌ను రెండింటినీ బ్యాలెన్స్‌ చేశారు. నేను ఓ సీరియస్‌ సీన్‌ తీసినా.. మళ్లీ యూటర్న్‌ తీసుకుని కామెడీ చేసేస్తా. నా సినిమాలో విలన్లు కూడా సరదాగానే ఉంటారు (నవ్వుతూ). 'పటాస్‌', 'సుప్రీమ్‌'.. ఇలా అన్నింటిలోనూ అలానే ఉంటుంది. 'ఎఫ్‌ 2' నా కెరీర్‌కు గేమ్‌ ఛేంజర్‌గా మారింది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైంది. 'సరిలేరు నీకెవ్వరు'లో రైలు సీన్‌ చూసి ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా థియేటర్‌కు వెళ్లడానికి సిద్ధమౌతున్నారు'.

మహేశ్​బాబుతో దర్శకుడు అనిల్ రావిపూడి

మహేశ్‌ స్వేచ్ఛ ఇస్తారు

'మహేశ్‌ సర్‌లోని గొప్ప లక్షణం.. స్వేచ్ఛ ఇవ్వడం. ఆయన అది ఇవ్వకపోతే మనం అంత పెద్ద స్టార్‌తో కలిసి పనిచేడానికి ఇబ్బందిగా ఫీల్‌ అవుతాం. ఆయన షూటింగ్‌కు వచ్చిన రోజు నుంచీ ఓ సూపర్‌స్టార్‌తో కలిసి పనిచేసిన భావన నాకు ఎప్పుడూ కలగలేదు. మహేశ్‌ జోక్‌లు వేస్తుంటారు, స్నేహంగా ఉంటారు. అసలు సమయం తెలియదు. మనకు సీన్‌ ఎలా కావాలో అలా వచ్చేంత వరకు నటిస్తూనే ఉంటారు. ఈ సినిమా వల్ల మహేశ్‌కు నేను ప్లస్‌ అవడం కాదు. నా కెరీర్‌కు ఆయన ప్లస్‌ అవుతారు. ఆయన చేయని పాత్రలు లేవు, చూడని బ్లాక్‌బస్టర్లు లేవు. కాబట్టి ఇది నాకే ప్లస్‌ అవుతుంది'.

కథ గెలిచింది

'సినిమాలో విజయశాంతిని చూసిన ప్రతి ఒక్కరు.. ఆమె 13 ఏళ్ల తర్వాత ఎందుకు ఈ పాత్రలో నటించారో అర్థం చేసుకుంటారు. ఎలాగైతేనే.. సరైన పాత్ర ఎంచుకున్నారు అనే ఫీలింగ్‌ వస్తుంది. 'రాజా ది గ్రేట్‌' సమయంలోనే ఆమెను కలిశా. ఓ మంచి పాత్రతో వెళ్తే ఆమె నటిస్తారనే నమ్మకం నాకు వచ్చింది. దీంతో ఆమె కోసం ఈ పాత్ర రాశా. విజయశాంతి గారిని ఒప్పించడం చాలా కష్టమైంది. నేను కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఆమెకు సినిమా చేయాలనే ఆసక్తే లేదు. రాజకీయాలతో బిజీగా ఉన్నారు. కానీ ఇక్కడ కథే గెలిచింది. 'మేడం కథ వినండి, మీకు నచ్చకపోతే వెళ్లిపోతా' అన్నాను. స్క్రిప్టు విన్న తర్వాత ఆమెకు పాత్ర నచ్చింది. మిగిలిన కథ నచ్చింది. అందుకే ఒప్పుకున్నారు. ఈ సినిమా చివరి 15 నిమిషాలకు అందరూ కనెక్ట్‌ అవుతారు. చాలా బాగుంటుంది'.

లేడీ సూపర్​స్టార్ విజయశాంతి

దేవిశ్రీకి హ్యాట్సాఫ్‌

'నేను కలిసిన మనుషుల్లో దేవిశ్రీ ఓ పాజిటివ్‌ వ్యక్తి. ఆయన ఇచ్చిన అన్నీ ట్యూన్స్‌ అద్భుతంగా ఉండటం అంటే కష్టం. దర్శకుడు చెప్పిన లైన్స్‌ను బట్టి ఆయన సంగీతం ఇవ్వాల్సి ఉంటుంది. తప్పు జరిగితే అది ఆయన బాధ్యత కాదు. గతం పక్కనపెడితే.. ఈ సినిమా కోసం సూపర్‌ మ్యూజిక్‌ అందించారు. సైనికుల గురించి గొప్పగా పాట రాశారు. దానికి ఆయన హ్యాట్సాఫ్‌ చెప్పాలి'.

కల్యాణ్‌ రామ్‌ ఉన్న స్థితిలో

'ఎన్నో సమస్యలు ఎదుర్కొని 'పటాస్‌' తీశా. ఇవాళ సూపర్‌స్టార్‌తో పనిచేసే దాకా ప్రయాణించా. నన్ను నమ్మి ఏ హీరో వచ్చినా.. వారి కోసం శ్రమించా. నన్ను మోసిన ప్రతి మెట్టు నాకు ముఖ్యమే. నందమూరి కల్యాణ్‌రామ్‌ నన్ను నమ్మి 'పటాస్‌'లో నటించారు. అప్పట్లో ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆ సినిమా చేయడం గొప్ప. 'ఓం' విడుదలై, ఆయన చాలా సమస్యల్లో ఉన్నారు. ఆయన లేకపోతే నేను లేను. కల్యాణ్‌రామ్‌, సాయిధరమ్‌, రవితేజ, వరుణ్‌తేజ్‌, వెంకటేష్‌.. ఇలా అందరూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు'.

దర్శకుడు అనిల్ రావిపూడి

ఇది పోటీ కాదు

"సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాల్ని ఒకే రోజు విడుదల చేయాలనే టాపిక్‌ వచ్చినప్పుడు ఒత్తిడిగా ఫీల్‌ అయ్యా. కానీ అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించారు. దీన్ని నేను పోటీగా భావించడం లేదు. త్రివిక్రమ్‌ గారి స్టైల్‌ వేరు. నాది వేరు. ఆయన క్లాస్‌గా తీస్తారు, నేను మాస్‌గా తీస్తాను. కాబట్టి ఎవరికి ఉండాల్సిన మార్కెట్‌ వారికి ఉంటుంది. సమస్య ఏమీ ఉండదు. ఇప్పటికే పలుమార్లు సంక్రాంతికి చాలా సినిమాలు ఒకేసారి వచ్చి హిట్‌ అయ్యాయి'.

  1. మీ సినిమాల్లో కథ ఉండదని విమర్శలు ఉన్నాయి?, కొన్ని సీన్లు జబర్దస్త్‌ కామెడీ ట్రాక్‌లలా ఉన్నాయని కామెంట్లు కూడా చేశారు?అని ప్రశ్నించగా అనిల్ సమాధానం ఇచ్చారు.

కథ లేకపోతే ప్రేక్షకుడు ఎందుకు చూస్తాడు. నా ప్రతి సినిమాలో కథ ఉంది. నేను చేసిన ప్రతి సినిమా ఆ హీరో కెరీర్‌కు హిట్‌ అయ్యింది. 'ఎఫ్‌ 2'లో భార్యాభర్తల సమస్యల్ని చూపించాం. అందరూ కనెక్ట్‌ అయ్యారు. ఇవి జబర్దస్త్‌లా ఉంటే థియేటర్లకు వచ్చి ఎందుకు సినిమా చూస్తారు. ఇంట్లో కూర్చొని జబర్దస్త్ చూస్తారుగా.. మనం చేసే పని 100 మందికి నచ్చదు. 70 మంది మెచ్చుకుంటే, 30 మంది ఏం తీసినా తిడతారు.. ఆ 70 మంది కోసం సినిమా తీస్తాం. మీరు అన్నారని నేను వేరే సినిమా తీసుకొస్తే.. మళ్లీ మీరేనన్ను అంటారు. నా బలం వదిలేసి.. పక్కకు వచ్చానని రాస్తారు.

  1. మీరు, చిరంజీవి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందేమో అని అందరూ అనుకుంటున్నారు. మీ స్టిల్స్‌ చూసి అలా ఫీల్‌ అవుతున్నారు. ఆయన కూడా మీపై ఆసక్తి చూపుతున్నారు?

మీరే మాతో సినిమా చేయించేలా ఉన్నారు (నవ్వుతూ). నాకు ఆయనతో పనిచేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తా. ఆయన 'ఊ..' అనాలే కానీ కథ రాయడం ఎంతసేపు. మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేసేస్తా. గతంలో బాలకృష్ణ సర్‌తో ఓ సినిమా అనుకున్నాం. ఆయన బిజీగా ఉన్నారు, చూడాలి.

  1. ఈ సినిమాలో కృష్ణ గారు ఉన్నారా?

సినిమాలో కృష్ణ సర్‌ ఉన్నారు. ఇది రాసి పెట్టుకోండి భయ్యా.. మీ ఒళ్లుగగుర్పొడుస్తుంది. థియేటర్‌లో ఆ సీన్‌ వచ్చినప్పుడు మీరు సర్‌ప్రైజ్‌ అవుతారు. కమర్షియల్‌ సినిమాలో ఇలా ఇద్దరు స్టార్స్‌ ఉండటం అరుదు. మీరంతా కచ్చితంగా సర్‌ప్రైజ్‌ అవుతారు.

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేశ్​బాబు

ABOUT THE AUTHOR

...view details