తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉండే శాఖలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అగ్ర దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు నిర్మాతల ప్రోత్సాహం, దర్శకులు, నటీనటుల సహకారం ఎలా ఉండాలనే తదితర విషయాలపై అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.
దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శీను సహా నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సి.కళ్యాణ్ తదితర ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇండోర్, ఔట్‌డోర్ సెట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు.. దర్శకుడిగా మొత్తం యూనిట్‌ను ఎలా నియంత్రించాలి.? ఏయే శాఖలపై కరోనా ప్రభావం ఎక్కువ? అనే అంశాలను చర్చించారు.
అనంతరం ఆయా వివరాలతో ప్రాథమికంగా నివేదిక తయారు చేశారు. ఇటీవలే చిరంజీవి నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన వీరంతా... సీఎం సూచన మేరకు విధి విధానాలపై దృష్టి సారించారు. 24 విభాగాల వారీగా చర్చించి నివేదిక రూపొందించారు. అందులో పేర్కొన్న అంశాలపై బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రి తలసానితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలవనున్నారు.