ఓ కథని నమ్మి, ఆ కథతో ప్రయాణం చేసి, తన అభిరుచుల మేర తీర్చిదిద్దడం దిల్‌రాజు శైలి. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో అతడు తొలిసారి ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో విజయవంతమైన '96' సినిమాను.. తెలుగులో 'జాను' పేరుతో తెరకెక్కించాడు. శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు కొన్ని విశేషాలు పంచుకున్నాడు.
ప్రభాస్ టైటిల్ ఇది..
"మా సినిమా టైటిల్ కోసం వెతుకుతున్నప్పుడు 'జాను' అనే పేరు తట్టింది. ప్రభాస్ సినిమాకి 'జాన్' అనే పేరు అనుకుంటున్నారు. అందుకే ప్రభాస్, యూవీ క్రియేషన్స్ అనుమతి తీసుకుని మా చిత్రానికి ఆ పేరు ఖరారు చేశాం. ప్రభాస్ చిత్రం విడుదలవ్వడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి రెండు పేర్ల మధ్య గందరగోళం ఎదురవ్వదు. అయినా ప్రభాస్ సినిమాకి టైటిల్‌తో పనిలేదు. అతడుంటే చాలు."
అనుకున్న దానికంటే ఎక్కువిచ్చా..
"96' టీజర్ చూడగానే నచ్చింది. అంతకు ముందు 'ప్రేమమ్', 'బెంగళూరు డేస్' సినిమాలు ఇలానే నచ్చాయి. కొన్ని కారణాల వల్ల రీమేక్ చేయలేకపోయాం. కానీ, ఈ సినిమాను వదులుకోవాలనుకోలేదు. నిర్మాతని పిలిచి 'ఓ అంకె చెప్పు..' అన్నాను. నిజానికి ఆయనకు అప్పటికి సినిమా హక్కుల్ని ఇచ్చే ఉద్దేశం లేదు. నేను గట్టిగా అడిగితే ఓ అంకె చెప్పారు. దానికంటే పాతిక లక్షలు ఎక్కువే ఇచ్చి సినిమాను కొన్నాను."