Pawan kalyan bheemla nayak: ఫిబ్రవరి 25న థియేటర్‌లలో మాస్ జాతరకు రంగం సిద్ధమైంది. 'వకీల్‌సాబ్' తర్వాత పవన్‌కల్యాణ్ 'భీమ్లా నాయక్'(Bheemla Nayak)గా దర్శనమివ్వబోతున్నారు. పవన్(Pawan kalyan)ను ఢీకొనే మరో కీలక పాత్రలో రానా(Rana) నటిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' చిత్రానికి రీమేక్‌గా సాగర్ కె.చంద్ర 'భీమ్లా నాయక్' తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను పెంచుతోంది. మాతృకతో పోలిస్తే, చాలా మార్పులే చేశారు. మరి మలయాళం చిత్రానికీ తెలుగు సినిమాకు ఉన్న భేదాలేంటి? 'అయ్యప్పనుమ్ కోషియుమ్' పాత్రలను తెలుగులో ఎవరెవరు? చేశారు? చూసేయండి.
* మలయాళ సినిమాకు కథలోని ముఖ్య పాత్రలైన అయ్యప్పనాయర్, కోషి కురియన్ పేర్లు కలిసేలా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ టైటిల్‌ను పెట్టారు. తెలుగులో కేవలం పవన్‌కల్యాణ్ పాత్ర పేరు ‘భీమ్లా నాయక్’ను మాత్రమే టైటిల్‌గా పెట్టారు.
* ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రాన్ని మలయాళ దర్శకుడు శచీ రచించి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా, కథలో మార్పులు, స్క్రీన్‌ప్లే, సంభాషణలను త్రివిక్రమ్ రాశారు.
* అయ్యప్పనాయర్ పాత్రలో బిజూ మేనన్ నటించగా, తెలుగులో ఆ పాత్రను ‘భీమ్లానాయక్’ పేరుతో పవన్‌కల్యాణ్ పోషించారు.
* మలయాళంలో రిటైర్డ్ హవల్దార్ కోషి కురియన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించగా, తెలుగులో అదే పాత్రను డేనియల్ శేఖర్‌గా రానా నటించారు.
* కోషి తండ్రి పాత్రలో రంజిత్ నటించగా, తెలుగులో సముద్రఖని ఆ పాత్ర చేశారు.
* ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’లో మరో ముఖ్యపాత్ర సీఐ సతీష్‌కుమార్. ఆ పాత్రను అనిల్ నెడుమగద్ పోషించగా, తెలుగులో కోదండరాంగా మురళీ శర్మ కనిపించనున్నారు.
* అయ్యప్పనాయర్ భార్య పాత్ర కన్నమ్మగా గౌరీ నందన్ నటించగా, తెలుగులో నిత్యామేనన్ ఆ పాత్ర పోషించారు.