తాత పెద్ద ఎన్టీఆర్ మొండితనమే చిన్న రామయ్యకు కూడా వచ్చిందని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 'పరుచూరి పలుకులు' పేరుతో ఆయన తన అభిప్రాయాలను యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. 'ఆది' సినిమా గురించి కొన్ని ఆసక్తి విషయాలను వెల్లడించారు.
ఆర్జీవీతో పోలికా..
"బెల్లంకొండ సోదరి నాగలక్ష్మి కోరిక మేరకు మేం 'ఆది' సినిమాకు డైలాగ్స్ రాశాం. డైలాగ్స్ రీడింగ్ ఇస్తున్న సమయంలో మా రెండో అమ్మాయి నాగ సుష్మ 'ఇది బాలకృష్ణ గారి స్క్రిప్టులా ఉంది. మరి తారక్ చిన్నవాడు కదా' అంది. 'నందమూరి తారక రామారావు గారి రక్తం అది ఎవరు చెప్పినా ఆ డైలాగ్ అలాగే పండుతుంది, కంగారు పడొద్దు' అన్నాను. తర్వాత నేను వినాయక్‌ను ఓ ప్రశ్న అడిగా. 'తారక్ రాగానే విలన్ ఎదురుగా కార్లు లేచిపోతున్నాయి. అన్ని సీన్లు ముందు భాగంలోనే పూర్తయిన తర్వాత ఇక చేయడానికి ఏముంటుంది అని' అన్నా. 'కాదు సర్ 'శివ'లో కూడా మొట్టమొదట నాగార్జున గారు అలా తిరగబడితే చూశారు కదా' అని వినాయక్ అన్నాడు. 'నువ్వు రామ్‌గోపాల్ వర్మ అంత బాగా తీస్తావా సినిమా?' అని నేను అన్నా. 'రామ్‌గోపాల్ వర్మ అంత తీయలేకపోవచ్చండీ.. కానీ ఒక 'శివ'లాగా ఫ్యాక్షన్ ఓరియంటెడ్‌గా తీయడానికి ప్రయత్నిస్తాను' అని చెప్పాడు. అన్నట్లుగానే మంచి హిట్ అయ్యే సినిమా తీశాడు వినాయక్".
తాతలాగే మొండితనం
"తారక్ రాయలసీమకొచ్చి మంచి నీళ్లు తాగేటప్పుడు అతని కళ్లు షాట్ చూస్తే.. వినాయక్ ఎంత బాగా ఆలోచించి ఈ సినిమా తీశాడో తెలుస్తుంది. విశాఖపట్నంలో సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తారక్ చెయ్యి అద్దానికి తగిలి దెబ్బ తగిలింది. అప్పుడు నేను షూటింగ్ ఆగిపోయిందా? అని అడిగా. లేదు సర్ తారక్ చేసేస్తాను అన్నాడు.. అని వినాయక్ చెప్పాడు. అప్పుడు నాకు అన్నగారు గుర్తొచ్చారు. అంటే తాతగారి మొండితనం ఈ పిల్లాడికి వచ్చేసింది. 'సర్దార్ పాపారాయుడు' క్లైమాక్స్‌లోనూ అన్నగారి చేతికి దెబ్బతగిలింది. కుడి చేత్తోనే కంఠాలు పిసికేసి యాక్ట్ చేశారు. ఆయన షూటింగ్‌ను మాత్రం ఆపరు. అదే లక్షణంతో ఇతను కూడా 'నాకు దెబ్బ తగిలితే షూటింగ్ ఆపడమేంటి.. చేద్దాం' అని బలవంతంగా షూటింగ్ చేశారు. షూటింగ్ అయిపోయింది సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద రష్ చూడగానే వినాయక్ మాట నిలబెట్టుకోవడం ఎంత నిజమో.. మా అమ్మాయితో నేను అన్నమాట 'అది రామారావుగారి రక్తం ఎవరికైనా ఒకటే' అన్నదానికి న్యాయం చేశారు తారక్. ఈ సినిమా చరిత్ర సృష్టించింది."
పెద్దనాన్న అని పిలుస్తారు..
"ప్రెస్‌మీట్‌లో తారక్ నన్ను పక్కకు పిలిచి 'మిమ్మల్ని పెదనాన్న అని పిలవొచ్చా' అని అడిగారు. 'తప్పకుండా పిలువు' అని చెప్పా. అప్పుడే ఫస్ట్‌టైమ్ నన్ను తారక్ పెదనాన్న అనిపిలిచారు. ఇప్పటికీ నన్ను పెదనాన్న అని గౌరవం ఇస్తాడు. అన్నగారి కుటుంబ సభ్యులు పరుచూరి కుటుంబం అంటే వేరే కుటుంబం అని చూడరు. అన్నగారి కుటుంబంలో ఒక భాగంలా చూస్తారు. సినిమాలో తారక్ బాబాయ్ క్యారెక్టర్ నేను చేసుంటే బాగుండేది. నాకు సంతృప్తిగా ఉండేది. అన్నగారికి కూడా ఆనందంగా ఉండేది" అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.