2000లో మిస్ ఆసియా పసిఫిక్ అందాల కిరీటం గెలుచుకున్న తర్వాత బాలీవుడ్ నటి దియా మీర్జా కెరీర్ సజావుగా సాగుతుందని అందరూ అనుకున్నారు. సినీ అవకాశాల కోసం శ్రమపడాల్సిన అవసరం లేదని భావించారు. 2001లో ఆమె రెహనా హై తేరే దిల్ మేతో నటిగా అరంగేట్రం చేశారు. ఆపై తానూ ఇబ్బందులు ఎదుర్కొన్నానని, చాలా అందంగా ఉన్న కారణంగా ఎన్నో సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
'నాకు తెలిసి చిత్ర పరిశ్రమలో మూస పద్ధతులు, ముందస్తు భావనలు మంచివి కావు. నా లుక్ వల్ల వృత్తిపరంగా ఎన్నో సార్లు ప్రతికూలతలు ఎదుర్కొన్నా. నేను చెబుతున్న మాటలు మీకు విచిత్రంగా అనిపించొచ్చు. నా చర్మం రంగు కెరీర్ పరంగా నాకు అడ్డంకి అయ్యింది. చామన ఛాయ రంగున్న మహిళలు కూడా ఇబ్బందులుపడుతున్నారని నాకు తెలుసు. చిత్ర పరిశ్రమలోని మూస పద్ధతి వల్ల పరిమితులు విధించుకున్నారు. నటించేందుకు అందరు మహిళలకు అవకాశాలు రావడం లేదు. అంతర్జాతీయ అందాల పోటీలో గెలవడం చాలా పెద్ద విషయమే. ఇది నాకు ఓ స్వరాన్ని, వేదికను ఇచ్చింది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దోహదం చేసింది. ఒకవేళ నేను అందాల పోటీలో గెలవకపోయుంటే సినిమాల్లో నటించే అవకాశం వచ్చేదో, లేదో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు నటనంటే ఇష్టం. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. మిస్ ఆసియా పసిఫిక్ దక్కించుకోకపోయుంటే.. మరో మార్గంలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేదాన్ని'