కరోనా ప్రభావంతో తప్పని పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలూ ఓటీటీ వైపు చూస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవ్‌గణ్ 'మేడే' కూడా అదే బాటలో వెళుతోందని వార్తలొస్తున్నాయి. ఆయన నటించిన 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' ఓటీటీలోనే విడుదలవుతోంది. అజయ్ నటించిన మరో చిత్రం ‘మైదాన్’నీ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇలా అగ్రహీరోల చిత్రాలన్నీ ఓటీటీ బాట పడితే థియేటర్ల మాటేంటి? అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.
'అప్పటికీ తెరుచుకోకపోతే.. మేం దివాళాయే!'
బాలీవుడ్లో అగ్రహీరోల సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీల్లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పంపిణీదారులు, ప్రదర్శనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్నాళ్లు థియేటర్లు తెరుచుకోకపోతే తమ పని దివాళాయేనని ఆవేదన చెందుతున్నారు.
ఈ విషయమై ప్రముఖ ప్రదర్శనకారుడు, పంపిణీదారుడు అక్షయ్ రతి మాట్లాడుతూ "కొన్ని నెలల క్రితమే అజయ్ ‘భుజ్’ చిత్రీకరణ పూర్తి చేశారు. ఆ తర్వాత ‘మేడే’లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇంకా చిత్రీకరణ చేయాల్సింది ఉంది. ‘మేడే’ 2022 వేసవికే విడుదలవుతుంది. అది కూడా థియేటర్లలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఒకవేళ అప్పటికీ థియేటర్లు తెరవకపోతే ఇక ఎప్పటికీ తెరవలేం. ఇక మా పని దివాళాయే"అని చెప్పారు. అజయ్‌దేవగణ్ దర్శకత్వం వహిస్తున్న మూడో చిత్రం ‘మేడే’. ఇందులో అమితాబ్‌బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.