బాలీవుడ్ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్.. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వీరిద్దరి వివాహం జరిగి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా మొదటి వివాహ వేడుకను కలియుగ దైవం సన్నిధిలో జరుపుకోనుందీ జంట. తాజాగా తిరుపతికి పయనమవుతూ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు.
ముంబయి విమానాశ్రయంలో దీపికా-రణ్వీర్ తిరుపతిలో దర్శనం చేసుకున్నాక నవంబర్ 15న అమృత్సర్లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రణవీర్ వివాహ వార్షికోత్సవానికి సిద్ధమవుతున్నాడు. ఈ హీరో ఫేస్ ప్యాక్ వేసుకున్న ఫొటోలను దీపికా ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ.. 'మొదటి వివాహ వార్షికోత్సవం కోసం సిద్ధమవుతున్న రణవీర్' అని క్యాప్షన్ ఇచ్చింది.
కొన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ జంట.. గతేడాది నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో కొంకిణి, సింథి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఈ దంపతులు వివిధ సందర్భాల్లో.. భార్యాభర్తల మధ్య అన్యోన్యతని చాటిచెప్పారు.
దీపికా పదుకొణె-రణవీర్ కలిసి '83' సినిమాలో నటిస్తున్నారు. 1983లో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో... కపిల్గా రణవీర్.. అతడి భార్య రోమి భాటియాగా దీపిక నటిస్తోంది. ఈ సినిమాతో పాటు యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఛపాక్' చిత్రంలో నటిస్తోంది దీపిక. బాలీవుడ్లో తెరకెక్కుతున్న మహాభారతంలో ద్రౌపదిగానూ కనిపించనుందీ బాలీవుడ్ బ్యూటీ.