బాలీవుడ్‌లో సీక్వెల్ చిత్రాలకు అమితమైన క్రేజ్ ఉంటుంది. ఆ జాబితాలో 'ధూమ్' ప్రథమంగా నిలుస్తుంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలే వీటికి అంతటి ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ఇప్పటికే దీనికి సంబంధించి మూడు ఫ్రాంచైజీలు ప్రేక్షకుల్ని అలరించగా త్వరలోనే 'ధూమ్ 4'ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
విలన్ అవతారంలో దీపిక.. నిజమేనా? - దీపికా పదుకొణె ధూమ్ 4 విలన్
బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొణె త్వరలోనే విలన్ పాత్రలో సందడి చేయనుందట. 'ధూమ్ 4' కోసం ఈ నటి ప్రతినాయకురాలి అవతారం ఎత్తనుందని టాక్.
గత చిత్రాలకు భిన్నంగా సినీ అభిమానులకు కొత్త అనుభూతి పంచేందుకు 'ధూమ్ 4'లో ప్రతినాయకురాలి పాత్ర ఉండబోతుందట. ఆ పాత్ర చాలా ప్రత్యేకమైందని, అలాంటి వైవిధ్యభరిత పాత్రకు దీపికా పదుకొణె అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీపికతో చర్చలు జరిపారని, ఆమె స్క్రిప్టుపై ఇష్టంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయంతోపాటు, కథానాయకుడు, దర్శకుల వివరాలకు సంబంధించి మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.
అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాతో కలిసి 'ధూమ్'లో జాన్ అబ్రహాం, 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్, 'ధూమ్ 3'లో ఆమీర్ ఖాన్ సందడి చేశారు. ప్రస్తుతం దీపిక చేతిలో 'పఠాన్', '83', 'మహాభారత్' చిత్రాలున్నాయి. శకున్ బాత్రా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ నటించనుంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.