మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) జాబ్ కార్డులపై బాలీవుడ్ నటీనటుల చిత్రాలు ఉండటం.. సామాజిక మాధ్యమాల వేదికగా సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ ఖర్గోనే జిల్లా, ఝిర్నియా పంచాయితీకి చెందిన జాబ్ కార్డులపై దీపికా పదుకొణె, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరుల ఫొటోలు దర్శనమిచ్చాయి. ఆ కార్డులు కూడా నకిలీవేనని అధికారులు అంటున్నారు. సోనూ శాంతిలాల్, మనోజ్ దూబె తదితరుల పేర్లతో.. సినీ తారల చిత్రాలతో 11 నకిలీ కార్డులు ఉన్నట్టు తెలిసింది. ఆ గ్రామంలో చెరువులు తవ్వినందుకు, కాలువలు పూడిక తీసినందుకు ఈ కార్డుల పేరు మీద చెల్లింపులు కూడా జరిగాయి. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు స్వాహా అయినట్టు జిల్లా అధికారులు భావిస్తున్నారు.
ఉపాధి హామీ కార్డులపై దీపిక-జాక్వెలిన్ ఫొటోలు
మధ్యప్రదేశ్లోని ఉపాధి హామీ జాబ్ కార్డులపై బాలీవుడ్ హీరోయిన్ల ఫొటోలు కనిపించడం వైరల్ అయింది. . ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు స్వాహా అయినట్టు జిల్లా అధికారులు భావిస్తున్నారు.
ఈ వ్యవహారంతో తమకు ఏ సంబంధం లేదని, తాము ఒక్క రోజు కూడా ఆ పనుల్లో పాలు పంచుకోలేదని కార్డులపై పేర్లు కలిగిన వ్యక్తులు తెలిపారు. ఇక దుబె అనే వ్యక్తి తనకు 50 ఎకరాల పొలం ఉందని.. తాము జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేయలేదని తెలిపారు. తన భార్య చిత్రాన్ని తీసివేసి దీపిక ఫొటో పెట్టి ఉంటారని.. ఈ వ్యవహారంలో పంచాయితీ అధికారుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పనుల్లో 100 శాతం వేతనాలను చెల్లించినందుకు ఝిర్నియా పంచాయితీ గతంలో ప్రశంసలు అందుకోవటం కొసమెరుపు!