జేమ్స్ బాండ్ సిరీస్లో 25వ సినిమా 'నో టైమ్ టూ డై'.. రాక మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్ 2న విడుదల అవ్వాల్సింది కాస్త అక్టోబరు 8న థియేటర్లలోకి రానుంది. ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం.. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తోంది.
తొలుత గతేడాది మార్చిలో 'నో టైమ్ టూ డై'ను రిలీజ్ చేయాలనుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న తీసుకురావాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 2కు వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబరు 8కి విడుదల తేదీ మారింది. గత 10 నెలల్లో సినిమా మూడుసార్లు వాయిదా పడింది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి సన్నిగిల్లే అవకాశముంది!