'అరణ్య చిత్రం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది' అన్నారు కథానాయకుడు రానా దగ్గుబాటి. ఈయన ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు రానా. ఆ ఆసక్తికర విశేషాలేంటో చదివేయండి...
ప్రతిరోజూ అదే చర్చ..
అసోంలోని కాజీరంగా ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ కథని రాసుకున్నారు. ఆయన స్క్రిప్ట్ వినిపిస్తున్నపుడే నాలో తెలియని ఉత్సాహం కలిగింది. ప్రభు 'కుంకి' అనే చిత్రం చేస్తున్నపుడే ఏనుగుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగేళ్లు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించారు. ఇందులో 18 ఏనుగులతో సాగే ప్రయాణం కొత్త అనుభూతి పంచుతుంది. షూటింగ్‌కి పదిహేను రోజుల ముందే థాయ్‌లాండ్‌కి వెళ్లాం. ప్రతిరోజూ నేనూ ప్రభు అడవికి వెళ్లి నా పాత్రకి, అక్కడున్న మొక్కకి ఏంటి సంబంధం? నాకు, కుందేలుకి ఏంటి సంబంధం? అంటూ చర్చించుకునేవాళ్లం. అడవిలో ఉండే ప్రతి జీవంతో నా పాత్ర ముడిపడి ఉంటుంది. శిక్షకుల సాయంతో ఏనుగులకి స్నానం చేయించి, ఆహారం అందించి వాటిని మచ్చిక చేసుకున్నాను.
అరటిపండు, బెల్లం..
ఏనుగులు మనుషుల్ని ఓ ఎనర్జీతో గుర్తిస్తాయి. తాకితే చాలు ఎవరు అనే విషయం ఇట్టే కనిపెట్టేస్తాయి. తొలినాళ్లలో అవి ఏమైనా చేస్తాయనే భయంతో జేబులో అరటిపండు, బెల్లం పెట్టుకుని తిరిగేవాణ్ని. ఓసారి జేబులోంచి అరటిపండు బయటికి వచ్చిన సంగతి నేను గుర్తించలేదు. అరటిపండు చూడగానే అక్కడున్న అన్ని ఏనుగులు నా వైపునకు వస్తుండటం వల్ల చాలా భయపడ్డాను. కానీ అనుకున్నంతగా ఏం జరగలేదు. వారం రోజుల్లోనే వాటితో స్నేహం కుదిరింది.
ఏనుగుల కోసం పోరాటం..
ఈ చిత్రంలో నరేంద్ర భూపతిగా కనిపిస్తాను. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొచ్చిన తర్వాత గ్రామ ప్రజలంతా 'అరణ్య' అని పిలవడం ప్రారంభిస్తారు. ఇప్పటికే ప్రేమ కోసం, ఇతరత్రా వాటికోసం పోరాడే సినిమాలు చేశాను. ఇది భూమి కోసం, జంతువుల కోసం పోరాడే చిత్రం కావడంతో ఎలాగైనా చేయాలనుకున్నాను. భవిష్యత్తు తరాలకు చూపించాల్సిన సినిమా ఇది. గతంలో జంతువు- మనిషి మధ్య అనుబంధం చూపించిన సినిమాలు వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో ఏనుగుల గురించి రాలేదు. సినిమా ప్రారంభంలో ఏనుగులతోపాటు అడవిలో ఉండే అన్ని జంతువుల్ని చూపించాం. వెండితెరపై అడవుని చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతికి లోనవుతారు. బయట కూడా కనిపించని పచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతగా మాయ చేశారు దర్శకుడు, ఛాయాగ్రాహకుడు.