తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీల్లో రాజ్యమేలుతున్న అలాంటి వెబ్​సిరీస్​లు - ఆహాా యాప్​

వెబ్​సిరీస్​ల ట్రెండ్​ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, లాక్​డౌన్​తో వచ్చిన విరామంలో వీటి క్రేజ్​ ఇంకా పెరిగింది. విజయవంతమైన పలు సిరీస్​లకు కొత్త సీజన్​లను విడుదల చేసే పనిలో ఉన్నారు సదరు దర్శక నిర్మాతలు.

crime thrillers web series goes trending on OTT
ఓటీటీల్లో సినిమాల కంటే అవే రాజ్యమేలుతున్నాయి

By

Published : Jul 1, 2020, 12:09 PM IST

Updated : Jul 1, 2020, 12:30 PM IST

క్రైం... థ్రిల్లర్‌... సస్పెన్స్‌... ఇంటరాగేషన్‌... ఏమిటీ ఈ పదాలు అంటారా? వెబ్‌ సిరీస్‌లు ఈ నాలుగు పదాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతున్నాయనిపిస్తోంది. ఏదో నేరం జరుగుతుంది. అది ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? దాని చుట్టూ ఉన్న పరిస్థితులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదకడమే ఇతివృత్తాలుగా వెబ్‌సిరీస్‌లు పుట్టుకొస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌, జియో, సన్‌నెక్ట్స్‌, ఆహా... ఓటీటీ వేదిక ఏదైనా, ఇవే రాజ్యమేలుతున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగానే ఎక్కువగా ఈ కథలు రూపొందుతున్నాయి. కొన్ని వ్యవస్థల కేంద్రంగా నడుస్తుంటే, మరికొన్ని వ్యక్తులు, ప్రాంతాల చుట్టూ అల్లుకుంటున్నారు కథకులు.

నార్కోస్​

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'నార్కోస్‌' వెబ్‌సిరీస్‌ ఇలాంటి నేపథ్యాలకు జోరందించిందని చెప్పుకోవచ్చు. కొలంబియా నుంచి అమెరికాకు విస్తరించిన డ్రగ్‌ మాఫియా, వారి వ్యవహారాలు, నేరాల తీరు, పోలీసుల నేర పరిశోధన ఇతివృత్తంగా నడుస్తుందీ కథ. సహజత్వం, నిజపాత్రలను పోలిన నటులు దొరకడం ఈ వెబ్‌సిరీస్‌ బృందానికి బలం చేకూర్చాయి. మనం దేశంలోనూ ఇలాంటి కథలను ఓటీటీ వేదికలకు ఎక్కువగా తెరకెక్కాయి. ఉత్కంఠ రేపే సన్నివేశాలతో ప్రస్తుతం అభిమానులను అలరిస్తున్నవి కొన్నైతే, రెండో సీజన్‌ రూపంలో త్వరలో ప్రసారం కాబోతున్నవి మరికొన్ని.

మీర్జాపూర్​

అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చిన 'మీర్జాపుర్‌' ఇలాంటి నేపథ్యమే. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో విస్తరించిన గన్‌కల్చర్‌పై రూపొందించిన వెబ్‌సిరీస్‌ ఇది. తుపాకుల తయారీ, దాని చుట్టూ అల్లుకున్న నేర సామ్రాజ్యం.. అందులోకి ఇద్దరు అన్నదమ్ములు ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనేదే కథాంశం. మొదటి సీజన్‌ ముగిసింది. నవంబర్‌లో 'మీర్జాపూర్‌ సీజన్‌ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎలాంటి థ్రిల్లింగ్ అంశాలు‌ ఉంటాయో చూడాలి. ఇలా ఓటీటీల్లో ప్రేక్షకులను ఎక్కువగా కట్టిపడేస్తున్నవి నేర కథలే కావడం విశేషం.

లాల్​బజార్​

ఎలా ఛేదిస్తారు

కోల్‌కతా నగరంలో నేరాలు, అవినీతి పెరిగిపోతుంటాయి. వీటిని నిర్మూలించడానికి అంకితభావం కలిగిన పోలీసు బృందం అహర్నిశలు శ్రమిస్తుంది. అప్పుడే నగరంలోని ఓ వేశ్య చనిపోతుంది. ఈ ఘటన పోలీసులకు ఎలాంటి సవాళ్లను విసురుతుంది అన్న కథాంశంతో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్‌ 'లాల్‌ బజార్‌'. ప్రస్తుతం జీ5లో అభిమానులను అలరిస్తోంది. కార్తీక్‌ సేన్‌, హ్రిషిత భట్‌, దివ్యేందు భట్టాచార్య, గౌరవ్‌ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు.

బ్రీత్​ 2

కూతురు దొరుకుతుందా?

తన కుమారుడికి ఊపిరితిత్తులు అమర్చేందుకు తండ్రి ఏం చేస్తాడన్న కథాంశంతో రూపొందింది 'బ్రీత్‌' మొదటి సీజన్‌. దీని రెండో సీజన్‌లో అభిషేక్‌ బచన్‌, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో హీరో కూతురు తప్పిపోతుంది. తనను వెతకడానికి తండ్రి ఎలా శ్రమిస్తాడన్న నేపథ్యంతో 'బ్రీత్‌' సీజన్‌ 2 ట్రైలర్‌ కనిపిస్తోంది. జులై 10న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాతాళ్​లోక్​

దాగి ఉన్న నేరాల గురించి..

అసంతృప్తితో ఉన్న ఓ పోలీస్‌కు ఓ హత్యాయత్నం కేసు అప్పగిస్తారు పైఅధికారులు. విచారణలో అతనికి ఈ కేసు వెనక దాగి ఉన్న శక్తులు, మోసాల గురించి తెలుస్తుంది. ఆ తర్వాత అతనేం చేశాడు? అనేది కథాంశమే 'పాతాళ్‌లోక్‌'. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో అలరిస్తోంది. దీనికి హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాత.

క్రిమినల్​ జస్టిస్​

ఆ హత్య వెనక ఎవరున్నారు?

ఓ ప్రయాణికురాలు సనన్యను ఎవరో దారుణంగా హతమారుస్తారు. ఈ నేరం మొత్తం క్యాబ్‌డ్రైవర్‌పై పడుతుంది. దీని నుంచి ఓ లాయర్,‌ ఆ డ్రైవర్‌ను ఎలా కాపాడుతుంది? డ్రగ్‌ మాఫియా సనన్యను ఎందుకు హతమారుస్తుందనే కథాంశంపై 'క్రిమినల్‌ జస్టిస్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో సీజన్‌ 2 హాట్‌స్టార్‌లో అభిమానులను అలరించనుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 'మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌', దేశరాజధాని దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన విచారణ నేపథ్యంలో తెరకెక్కిన 'దిల్లీ క్రైం', నవాజుద్దీన్‌ సిద్దిఖీ, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధానంగా రూపొందిన 'సాక్రెడ్‌ గేమ్స్‌', 25 ఏళ్ల కుర్రాడు ఎలా గ్యాంగ్‌స్టర్‌గా మారాడన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రంగ్‌బాజే' వంటి థ్రిల్లర్‌ సిరీస్‌లు ఇప్పటికీ అభిమానుల మనసులు దోచుకుంటున్నాయి. ఆహా ఓటీటీ వేదికలో విడుదలైన 'లాక్డ్​', 'మిస్టిస్‌' ఇదే కోవలోనివే.

ఎందుకు ఇలాంటి కథలే?

అంతర్జాతీయ సినిమా అరచేతిలోకి వచ్చిన నేపథ్యంలో ఇంకా పాత కథలే చెబుతానంటే ప్రేక్షకుడ్ని మెప్పించడం కష్టం. 'థింక్‌ లోకల్‌... మేక్‌ గ్లోబల్‌' అనే నినాదం సినిమా, వెబ్‌ కథల విషయంలో పాటించాలనేది ఇప్పుడు చాలా మంది దర్శకులు, రచయితలు చెబుతున్న మాట. అందుకే కొత్తదనం, వాస్తవికత, స్థానికత, అనుక్షణం ఉత్కంఠ కలిగించే నేర నేపథ్యాలను ఓటీటీ వేదికలకు కథా వస్తువుగా ఎంపికచేసుకుంటున్నారు. తక్కువ మంది నటులతో, తక్కువే ఖర్చు పెట్టినా ప్రేక్షకుడిని కట్టిపడేయొచ్చు.

సినిమాకైతే రెండున్నర గంటలో కథ మొత్తం చెప్పాలి. వెబ్‌సిరీస్‌లకు వచ్చే సరికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఒక్కో ఎపిసోడ్‌కు 40 నుంచి 45 నిమిషాల చొప్పున సీజన్‌కు 10 భాగాలు అనుకుంటే 7.30 గంటల వరకూ కథను నడపాలి. ఇందుకు వివిధ ప్రాంతాలు, భిన్నమైన వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగిన నేర ఘటనలైతే బాగా ఉపయోగపడతాయి. పైగా ప్రేక్షకులు వీటిని ఎక్కువగా ఇష్టపడి చూస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే రిచ్‌ లుక్‌ తీసుకొచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శకులు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇలాంటి వెబ్‌సిరీస్‌లతో సమాజంలో నేర ప్రవృత్తి, శృంగారాలను మితిమీరి జొప్పిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.

ఇదీ చూడండి...'కష్టమైనా.. అవి మధుర జ్ఞాపకాలే'

Last Updated : Jul 1, 2020, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details