తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా కోరల్లో సినీతారలు.. మరి షూటింగ్​లు? - తెలుగు సినీ తారలకు కరోనా

కరోనా మళ్లీ పంజా విసురుతున్న వేళ... తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనూ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొదటి దశ, రెండో దశలో పలువురు నటులు కరోనా బారినపడటం, లాక్​డౌన్​ కారణంగా షూటింగ్​లు నిలిచిపోయాయి. చిత్రసీమ స్తంభించిపోయింది. అనంతరం తిరిగి కోలుకొని అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న వేళ ఇప్పుడు మళ్లీ మూడో ముప్పుగా భావిస్తున్న ప్రస్తుత పరిస్థితులు టాలీవుడ్​ను కలవరపెడుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు మరికొంత మంది నటీనటులు వైరస్​ బారినపడటం వల్ల చిత్ర పరిశ్రమలో కలవరం మొదలైంది. పలు చిత్రాల షూటింగ్​లు వాయిదా పడుతున్నాయి.

covid cases in film industry
సినీతారలకు కరోనా

By

Published : Jan 8, 2022, 7:28 AM IST

టాలీవుడ్​పై కరోనా వైరస్ మళ్లీ కన్నెర్రజేస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నా.. జాగ్రత్తలు పాటిస్తున్నా.. ఆ మహామ్మారి వదలడం లేదు. మొదటి రెండు దశల్లో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్​తో పాటు పలువురు అగ్ర తారలు కరోనా బారినపడ్డారు. తిరిగి కోలుకొని అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న క్రమంలో మళ్లీ మూడో ముప్పు నటీనటులను కలవరపెడుతోంది.

సూపర్​స్టార్​కు కరోనా..

Covid to Mahesh Babu: దుబాయ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు స్వయంగా ప్రకటించిన మహేశ్.. వైద్యుల సూచనలతో క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. మహేశ్ కంటే ముందే నమత్రా శిరోద్కర్ సోదరి శిల్ప శిరోద్కర్​కు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మహేశ్ కుటుంబం నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా మహేశ్ బాబుకు పాజిటివ్​గా తేలింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కరోనా

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రీకరణలో ఉన్న మహేశ్.. కరోనా బారినపడటం వల్ల ఆ చిత్ర బృందంలో ఆందోళన నెలకొంది. తనను కలిసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని మహేశ్ సూచించారు. ఆస్పత్రుల పాలవకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మహేశ్​.. త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు వరుస పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా చిరంజీవి, ఎన్టీఆర్, సాయితేజ్, సత్యదేవ్ సహా మరికొంత మంది నటీనటులు మహేశ్ బాబు కోలుకోవాలని, వెండితెరపై ఆయన యాక్షన్ చూసేందుకు అతృతగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు.

తమన్​కు కూడా..

Corona Positive to Thaman: సినిమా పనుల్లో భాగంగా మహేశ్ బాబును కలిసిన తర్వాత తమన్ కూడా కరోనా బారినపడ్డారు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకుతుందని, ప్రతి ఒక్కరు కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని తమన్ కోరారు.

బూచోడు పట్టుకున్నాడు..

మోహన్ బాబు కుటుంబంపైనా కరోనా పంజా విసింది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మితోపాటు మంచు మనోజ్ కూడా కరోనా బారినపడ్డారు. రెండేళ్లుగా దోబూచులాడుతున్న కరోనా బూచోడు ఎట్టకేలకు తనను పట్టుకున్నాడని మంచు లక్ష్మి సరదాగా వ్యాఖ్యానించింది. తాను నేర్చుకున్న కలరి పోరాట విద్యను కరోనాపై ప్రయోగిస్తానని చమత్కరించింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఇంటి వద్దనే ఉంటూ సురక్షితంగా ఉండాలని తెలిపింది.

మంచు లక్ష్మికి కరోనా

వరలక్ష్మినీ వదల్లేదు..

విలక్షణ పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్​కు కూడా కరోనా సోకింది. సమంత నటిస్తున్న 'యశోద' చిత్రంతో పాటు బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కోసం హైదరాబాద్ వచ్చిన వరలక్ష్మికి కరోనా సోకింది. వెంటనే ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది.

యువ హీరోలకూ..

యువ కథానాయకుడు విశ్వక్ సేన్​కు పాజిటివ్ రాగా హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. మరో కథానాయకుడు నితిన్ భార్య కరోనా బారినపడింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నితిన్... ఐసోలేషన్ లో ఉన్న శాలిని పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా జరిపాడు. పైఅంతస్తులో ఉన్న శాలిని గది బయట ఆవరణలో కేక్ కట్ చేసి ఆనందాన్ని నింపాడు. కరోనా అడ్డంకులు సృష్టించినా తమ ప్రేమకు అడ్డంకులు ఉండవంటూ శాలిని పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోను సామాజిక మాద్యమాల్లో పంచుకున్నాడు.

తమిళంలో వీరికి..

Corona Positive to Trisha: అటు చెన్నైలోనూ పలువురు నటీనటులు కరోనా బారినపడ్డారు. కథానాయిక మీనాతోపాటు ఆమె కుటుంబసభ్యులందరికి కరోనా సోకింది. 2022లో మా ఇంటికొచ్చిన తొలి అతిథి కరోనా అని పేర్కొన్న మీనా... ఆ అతిథిని ఇంట్లో ఉండనివ్వనని హెచ్చరించింది. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కథానాయకుడు అరుణ్ విజయ్ కూడా కరోనా బారినపడ్డారు. ప్రముఖ నటి త్రిష కూడా శుక్రవారం వైరస్​ బారినపడ్డారు. అలాగే బాలీవుడ్ లోనూ పలువురు నటీనటులు కరోనాకు చిక్కారు.

నటి త్రిష

షూటింగ్​లపై ప్రభావం..

Corona Effect on Tollywood: ఇలా చిత్ర సీమలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం సినిమాల చిత్రీకరణలపై ప్రభావం పడే అవకాశం ఉందని దర్శక నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొవిడ్ కారణంగా ఈ నెలలో విడుదల కావల్సిన భారీ బడ్జెట్ చిత్రాలన్నీ వాయిదా పడగా తాజాగా సినిమా చిత్రీకరణలు కూడా పలువురు దర్శకులు నిలిపివేస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'లైగర్' చిత్రీకరణ నిలిచిపోయింది. ముంబయిలో ఈ సినిమా చిత్రీకరణ చేయాల్సి ఉండగా అక్కడ కేసుల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుండటం వల్ల షూటింగ్ వాయిదా వేశారు. దీంతో హైదరాబాద్ తిరిగొచ్చిన విజయ్ ఇంట్లో సేదతీరుతూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

అలాగే సల్మాన్ ఖాన్, కత్రినా కైప్ జంటగా నటిస్తున్న 'టైగర్ 3' చిత్రాన్ని 15 రోజులపాటు దిల్లీలో చిత్రీకరణ చేయాల్సి ఉండగా కొవిడ్ ఉద్ధృతితో వాయిదా పడింది. ముంబయి, దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో సినిమాలు చిత్రీకరణ చేయాలని సన్నాహాల్లో ఉన్నవారంతా ప్రస్తుతం వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:రెండు, మూడు రోజుల్లో చనిపోతాననుకున్నా: రాజశేఖర్‌

ABOUT THE AUTHOR

...view details