కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవటానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ ముందుకొచ్చాడు. 25 వేల మంది కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని ఇటీవలే తెలిపాడు. అందులో భాగంగా 23 వేల మంది పేద కార్మికుల వివరాలను మంగళవారం సల్మాన్‌కు అందించినట్లు భారత పశ్చిమ సినీకార్మికలు సమాఖ్య(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) అధ్యక్షుడు బీఎన్ తివారి తెలిపారు. ప్రతి ఒక్క కార్మికుడికి మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్టు చెప్పాడు. ఒకవేళ దేశంలో ఇదే పరిస్థితే కొనసాగితే భవిష్యత్‌లో మరోసారి వారికి సల్మాన్ సహకారం అందిస్తాడని సమాచారం.
రేషన్ కూపన్లు అందిస్తానన్న అమితాబ్
యశ్‌రాజ్ నిర్మాణ సంస్థ 3వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిందని తివారి తెలిపారు. సినీపరిశ్రమ నుంచి ఇప్పటివరకు మూడు కోట్ల విరాళాలు అందాయని.. ఏప్రిల్ 15 తర్వాత దశల వారిగా అవసరమైన వారికి డబ్బును పంచుతామని చెప్పారు. అమితాబ్ బచ్చన్ లక్ష మందికి రేషన్ కూపన్లు అందజేయనున్నట్టు వెల్లడించారు. బాలీవుడ్లోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, కర్ణాటకకు చెందిన సినీకార్మికులకూ ఈ కూపన్లు అందిస్తామన్నారు.