తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకేసారి 'ఏడు' శుభవార్తలు చెప్పారు - ఖుదాఫీజ్ విద్యుత్ జమ్వాల్

బాలీవుడ్​లో ప్రముఖ నటీనటులతో తెరకెక్కిన ఏడు సినిమాలు త్వరలో డిస్నీ+హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ స్టార్స్​ వెల్లడించారు.

ఒకేసారి 'ఏడు' శుభవార్తలు చెప్పారు
బాలీవుడ్​ సినిమాలు

By

Published : Jun 29, 2020, 6:33 PM IST

కొత్త సినిమాలతో సందడిగా మారాల్సిన వేసవి.. కరోనా కారణంగా బోసి పోయింది. నానాటికీ దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన చిత్రాలు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్‌లలోనే తమ సినిమాను విడుదల చేస్తామని కొందరు దర్శక-నిర్మాతలు చెబుతుండగా, మరికొందరు మాత్రం ఓటీటీలవైపు చూస్తున్నారు. సినిమా కోసం చేసిన అప్పులపై వడ్డీలు పెరుగుతుండటం, రోజులు గడిచే కొద్దీ ఆ కంటెంట్‌ పాతబడిపోతున్న భావన కలుగుతుండటం చిత్ర బృందంపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఎప్పటికప్పుడు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతూ మంచి రేటు వస్తే ఇచ్చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా 'పొన్‌మగళ్‌ వందాళ్‌', 'గులాబో సితాబో', 'పెంగ్విన్‌' చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఏడు సినిమాలను విడుదల చేయనున్నారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం 'దిల్‌ బెచారా' జులై 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా, తాజాగా మరో ఆరు చిత్రాలను కూడా డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. 'బాలీవుడ్‌ కి హోం డెలవరీ' కార్యక్రమంలో భాగంగా అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవ్‌గణ్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఆలియాభట్‌, వరుణ్‌ధావన్‌లు ట్విటర్‌ వేదికగా ముచ్చటించారు. ఇందులో అక్షయ్‌కుమార్‌ 'లక్ష్మీ బాంబ్‌', అజయ్‌ దేవ్‌గణ్‌ 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా', ఆలియాభట్‌ 'సడక్‌2', అభిషేక్‌ బచ్చన్‌ 'ది బిగ్‌బుల్‌', విద్యుత్‌ జమ్వాల్‌ 'ఖుదాఫీజ్‌', కునాల్‌ ఖేమూ 'లూట్‌ కేస్‌' చిత్రాలు విడుదలను డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ ద్వారా సినిమాలు విడుదల కావడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. జులై నుంచి అక్టోబరు 2020 మధ్య ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. త్వరలోనే ఈ చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీలను, పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

లక్ష్మీబాంబ్ సినిమా ఫస్ట్​లుక్
భుజ్​ సినిమా కొత్త లుక్స్
దిల్​ బెచారా సినిమా పోస్టర్
ద బిగ్ బుల్ ఫస్ట్​లుక్
సడక్ 2 ఫస్ట్​లుక్ పోస్టర్
ఖుదాఫీజ్​ సినిమాలో విద్యుత్ జమ్వాల్
లూట్​కేస్ సినిమా పోస్టర్

ABOUT THE AUTHOR

...view details