కరోనా ప్రభావంతో జీవనోపాధి కోల్పోయిన సినీకార్మికులకు అండగా నిలిచేందుకు హీరో సూర్య ముందుకొచ్చారు. దక్షిణ సినీకార్మికుల సమాఖ్యలోని కార్మికులను ఆదుకునేందుకు రూ.1.5 కోట్లు విరాళమిస్తున్నట్లు ప్రకటించారు.
హీరో సూర్య రూ.కోటిన్నర విరాళం - Aakasamy ne haddura releases on october 30
కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం తొలి విడతగా రూ.1.5 కోట్లు విరాళమిచ్చారు హీరో సూర్య. చెక్‌లను అతడి తండ్రి శివకుమార్ దక్షిణ సినీకార్మికుల సమాఖ్య అధ్యక్షుడికి అందజేశారు.
తన కొత్త సినిమా 'ఆకాశం నీ హద్దురా' ఓటీటీలో రానుందని చెప్పిన సూర్య.. తర్వాతి రెండు చిత్రాలు మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. 'ఆకాశం నీ హద్దురా' వ్యాపారం ద్వారా వచ్చే రూ.5 కోట్లను కరోనా నియంత్రణకు అందిస్తానని సూర్య గతంలోనే చెప్పారు. ఆయన ప్రకటించిన విరాళంలో మొదటి విడతలో భాగంగా శుక్రవారం రూ. 1.5 కోట్లను.. భారతీరాజా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఎఫ్ఆఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి అధిపతి కలైపులి ఎస్ థానులకు సూర్య తండ్రి శివకుమార్ అందజేశారు. అందులో దక్షిణ సినీకార్మికుల సమాఖ్య (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ)కు కోటి రూపాయలు, తమిళ చిత్ర నిర్మాతల మండలికి రూ.30 లక్షలు, నడిగర్ సంఘానికి రూ.20 లక్షలు చెక్‌లను అందజేశారు.
'ఆకాశం నీ హద్దురా' చితానికి సుధా కొంగర దర్శకురాలు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్ గోపీనాథ్ బయోపిక్ ఈ సినిమా. ఏప్రిల్ 9నే రావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. సుదీర్ఘ చర్చల అనంతరం అక్టోబరు 30న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే సూర్య ప్రకటించారు. ఇందులో విలక్షణ నటుడు మోహన్‌బాబు కీలకపాత్ర పోషించారు.