తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రత్యేకం: సినిమాకే 'సినిమా' చూపిస్తున్న కరోనా - entertainment news

వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా.. సినిమాల్ని వదలడం లేదు. ఈ వైరస్​ వల్ల షూటింగ్​లు, ప్రచారాలు, విడుదల కార్యక్రమాలు ఎక్కడిక్కడే నిలిచిపోతున్నాయి.

ప్రత్యేకం: సినిమాకే 'సినిమా' చూపిస్తున్న కరోనా
సినీ రంగంపై కరోనా ప్రభావం

By

Published : Mar 6, 2020, 7:46 AM IST

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. పలు దేశాల్లోని కీలక రంగాలు కుదేలవుతున్నాయి. మనదేశంలోనూ కరోనా ప్రవేశించి కలవరపెడుతోంది. ప్రజలకు వినోదాన్ని పంచే చిత్ర పరిశ్రమపైనా కరోనా ప్రభావం చూపెడుతోంది. పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్నాయి. కొన్ని సినిమాలు విదేశాల్లో జరగాల్సిన షూటింగ్‌లను నిలిపివేశాయి. థియేటర్లకు జనం రాక తగ్గిపోవడం వల్ల వసూళ్లు తగ్గడం మొదలైంది. ఈ పరిస్థితి ఇంకా ఎక్కడి వరకూ దారితీస్తుందో అని ఇండస్ట్రీ ఆందోళనలో ఉంది.

చైనాలో మొదలైన కరోనా.. నెమ్మదిగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఫలితంగా హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ నష్టపోయింది. ఆ చిత్రాలకు కీలకమైన మార్కెట్‌ ఉన్న దేశాల్లో చైనా ఒకటి. కరోనా దెబ్బకు చైనా సినీ పరిశ్రమకు గత రెండు నెలల కాలంలో సుమారు రెండు బిలియన్‌ డాలర్లు నష్టం వాటిల్లింది. దక్షిణకొరియా, జపాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాల్లోని చిత్ర పరిశ్రమలపైనా కరోనా ప్రభావం గట్టిగానే ఉంది. కరోనా ప్రభావిత దేశాల్లో నెలల తరబడి థియేటర్లు మూసేశారు. పలు హాలీవుడ్‌ సినిమాల చిత్రీకరణలు, ప్రచారాలు వాయిదా పడ్డాయి. 'మిషన్‌ ఇంపాజిబుల్‌ 7' చిత్రీకరణను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.

జేమ్స్‌బాండ్‌కూ తప్పలేదు

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్‌ బాండ్‌ చిత్రం 'నో టైమ్‌ టు డై'. కరోనా వైరస్‌ కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. డేనియల్‌ క్రేగ్‌, రమీ మాలిక్‌ ప్రధాన పాత్రల్లో క్యారీ జోజీ తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్‌ ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. కరోనా ప్రభావం కారణంగా ఏడు నెలలపాటు విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. నవంబరు 12 యూకేలో, 25న ఇండియాలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టూ డై'

టిక్కెట్లు తెగడం లేదు

హాలీవుడ్‌ బాక్సాఫీసును కుదిపేస్తున్న కరోనా.. భారతీయ చిత్రపరిశ్రమను దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం కనిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా కరోనాపై భయాందోళనలు పెరగడం వల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గింది. సుమారు 15 నుంచి 20 శాతం వసూళ్లు తగ్గిపోయాయి. వారం రోజుల కిందటే బుక్‌ చేసుకున్న టికెట్లనూ ఇప్పుడు రద్దు చేసుకుంటున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధాకపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం 'భాఘీ 3'.. భారీ అంచనాలతో శుక్రవారం వస్తోంది. మంచి ప్రారంభ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అనుకుంటున్న ఈ సినిమా వసూళ్లపైనా కరోనా ప్రభావం తప్పదేమో అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

షూటింగ్‌ బంద్‌

పలు చిత్ర నిర్మాణ సంస్థలు తమ సినిమాల్ని విదేశాల్లో తెరకెక్కించడానికి ముందుగానే సన్నాహాలు చేసుకున్నాయి. చైనా, థాయ్‌లాండ్‌, ఇటలీ, జపాన్‌ తదితర దేశాల్లో చిత్రీకరణ కోసం ఏర్పాట్లు చేసుకున్నాయి. కానీ కరోనా ప్రభావం కారణంగా షూటింగులను వాయిదా వేసుకోవడమో, పూర్తిగా రద్దు చేయడమో చేస్తున్నాయి. సల్మాన్‌ఖాన్‌-ప్రభుదేవా కాంబినేషన్​లో తీస్తున్న 'రాధే' చిత్రాన్ని థాయ్‌లాండ్‌లో తెరకెక్కించాలని ముందుగానే అనుకున్నారు. ప్రస్తుతం అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ను రద్దు చేసి, ముంబయిలోనే తీయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఈద్‌కు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. థాయ్‌లాండ్‌ చిత్రీకరణలకు అనువుగా ఉండటం వల్ల పలు నిర్మాణ సంస్థలు అక్కడే చిత్రీకరిస్తుంటాయి. కరోనా ప్రభావంతో అక్కడ తీయాలనుకున్న మరిన్ని సినిమాల షూటింగ్‌లు ఆగిపోయే అవకాశం ఉంది.

కరోనా కారణంగా కొందరు చిత్రాల షూటింగులు, విడుదల, ప్రచార కార్యక్రమాల్ని వాయిదా వేసుకుంటుంటే మరి కొందరు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా కరోనా ప్రభావం పెరిగే కొద్దీ బాక్సాఫీసుకు నష్టమే అంటున్నాయి చిత్ర పరిశ్రమ వర్గాలు.

ABOUT THE AUTHOR

...view details