కరోనా ప్రభావం సినిమాలపై రోజురోజుకూ పెరుగుతోంది. హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ చిత్రాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'ఎఫ్9', బాలీవుడ్ చిత్రం 'సూర్యవంశీ' చేరాయి. ఈ వైరస్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితీ గందరగోళంగానే మారింది. కొన్ని చోట్ల థియేటర్లు మూతపడుతున్నాయి. ఉగాదికి రానున్న చిత్రాల విడుదల సందిగ్ధంలో పడింది. వేసవి చిత్రాలపైనా ఈ ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
కొన్నాళ్లుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ప్రేక్షకుల సందడి లేక బాక్సాఫీసు బోసిపోయింది. ఇది పరీక్షల కాలం, పైగా అగ్ర తారల సినిమాల విడుదలలు లేవు కాబట్టి ఆ ప్రభావం టాలీవుడ్‌పై పెద్దగా కనిపించలేదు. కరోనా ప్రభావం ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపించినా, మన సినిమాకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదన్నట్టుగా ధైర్యంగా కనిపించాయి వ్యాపార వర్గాలు.
ఇప్పుడు మన తెరనూ కాటేసింది కరోనా. నెల్లూరులో థియేటర్లు శుక్రవారం మూతపడ్డాయి. మన సినిమాలు బాగా ప్రదర్శితమయ్యే కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ, అలాగే ఒడిశాలోనూ థియేటర్లు బంద్ అయ్యాయి. ఓవర్సీస్ వ్యాపార వర్గాలైతే విడుదల తేదీల్ని మార్చేయాల్సిందేనని చాలా రోజులుగా పట్టుబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండటం వల్ల అన్నివైపుల నుంచి మన సినిమాకు ముప్పు ఏర్పడినట్టయింది. తెలుగు సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల తేదీల్ని మార్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో పంపిణీదారులు, ప్రదర్శనకారులు, నిర్మాతలు నేడు సమావేశం కాబోతున్నారు. కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఉగాది సినిమాలు రావా?
తెలుగు సినిమాకు కీలకమైన సీజన్ వేసవే. అది ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. నిర్మాతలు పక్కా ప్రణాళికలతో చిత్రాల్ని విడుదల చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రచార కార్యక్రమాల్ని ఇప్పుడిప్పుడే ముమ్మరం చేస్తున్నారు. ఇంతలోనే కరోనా మన తెరను కమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదట నెల్లూరులో థియేటర్లు బంద్ అయ్యాయి. శనివారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. బయటి రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ ఇప్పటికే కరోనా ప్రభావం బలంగా ఉండటం వల్ల మన సినిమాలకు వాయిదాలే శరణ్యంగా కనిపిస్తోంది. ఒక్క సినిమా వాయిదా పడిందంటే... ఆ తర్వాత సినిమాల విడుదల తేదీలు తారుమారువుతాయి. అలా కీలకమైన వేసవి సీజన్‌పై గట్టి దెబ్బపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాదికి విడుదల కావల్సిన నాని సినిమా 'వి' దాదాపు వాయిదా పడినట్టే. వచ్చే నెల 2న రావాల్సిన రానా 'అరణ్య' వాయిదా పడింది. అనుష్క 'నిశ్శబ్దం' విడుదలపైనా సందిగ్ధం నెలకొంది. ఈ పరిణామాలు మన సినిమా పరిశ్రమకు నష్టం కలిగిస్తాయనడంలో సందేహం లేదు. ఈ విషయం గురించి ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు 'ఈనాడు సినిమా'తో మాట్లాడారు.