తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనాతో బాలీవుడ్​కు రూ.800 కోట్ల నష్టం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ చిత్ర పరిశ్రమనూ భయపెడుతోంది. ఇప్పటికే షూటింగ్​లు రద్దవగా.. సినిమా విడుదలలూ ఆగిపోయాయి. ఫలితంగా బాలీవుడ్​కు 800 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

Corona Effect: Bollywood set to lose Rs 800 crore
కరోనాతో బాలీవుడ్​కు రూ.800 కోట్ల నష్టం

By

Published : Mar 19, 2020, 11:18 AM IST

కరోనా ప్రభావం భారతీయ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవైపు షూటింగ్​లు రద్దవగా.. మరోవైపు సినిమా విడుదలలూ ఆగిపోయాయి. దీంతో బాలీవుడ్​కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల నిర్మాతలు నష్టాల బారిన పడుతున్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ చిత్ర పరిశ్రమనూ భయపెడుతోంది. సినిమాల ప్రదర్శనలు, విడుదల, చిత్రీకరణ ఇలా అన్నింటా కరోనా అడ్డుపడుతోంది. మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్, బిహార్, పంజాబ్‌ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 3500 థియేటర్లు మూతపడ్డాయి. దీంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పటి వరకు రూ.800 కోట్లు నష్టపోయిందని సమాచారం.

మార్చి 6న విడుదలైన 'బాఘీ 3'.. మొదటి వారంలోనే రూ. 90.67 కోట్లు వసూలు చేసింది. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించాడు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'ఆంగ్రేజీ మీడియం' తొలి మూడు రోజుల్లోనే 59.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఆ తర్వాత థియేటర్లు మూతపడటం వల్ల ఈ సినిమాలు నష్టపోతున్నాయి. 'బాఘీ 3' నిర్మాతలకు 25 నుంచి 30 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. వారాంతాల్లో థియేటర్లు మూసివేయడం వల్ల 'ఆంగ్రేజీ మీడియం'పై తీవ్ర ప్రభావం పడింది. దాంతో ఈ సినిమా నష్టాల బారిన పడింది.

సినిమాల ప్రదర్శన నిలిపేయడమే కాకుండా, కొత్త సినిమాల విడుదలలూ లేకపోవడం వల్ల బాలీవుడ్‌ భారీగా నష్టపోతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ హిందీ చిత్రాల విడుదల వాయిదా పడింది. 'బ్రహ్మాస్త్ర', 'సూర్యవంశీ' వాయిదా పడ్డాయి. దీనికితోడు జేమ్స్ బాండ్ తదుపరి సినిమా 'నో టైమ్ టు డై', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' లాంటి హాలీవుడ్‌ సినిమాలూ వెనక్కి మళ్లాయి. హాలీవుడ్‌ సినిమాలకు అందులోనూ బాండ్‌, ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ లాంటి సినిమాలకు మన దగ్గర మంచి మార్కెట్‌ ఉంది. ఇదిలా ఉండగా చిత్రీకరణలూ నిలిపేయడం వల్ల నష్టం మరింత పెరిగింది. ఇవన్నీ కలిపితే బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ సుమారు రూ.800 కోట్లు నష్టపోయిందని ట్రేడ్‌ అనలిస్టులు చెబుతున్నారు.

ఇదీ చూడండి.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న తారలు

ABOUT THE AUTHOR

...view details