కరోనా దెబ్బకు ఇప్పటికే చిత్రసీమ చాలా నష్టపోయింది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే పూర్తిగా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. తొలి దశ, రెండో దశ మధ్యలో కాస్త తెగించి కొందరు దర్శకనిర్మాతలు మధ్యలో ఆగిపోయిన తమ సినిమాలను పూర్తి చేశారు. కానీ రెండో వేవ్ కారణంగా విడుదల చేయడం చాలా పెద్ద సమస్యగా మారింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక చిత్రబృందాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఓ విధంగా చెప్పాలంటే భారీ బడ్జెట్ చిత్రాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.
ఈ ఏడాది బాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాల్లో అక్షయ్‌కుమార్ నటించిన 'బెల్ బాటమ్(bell bottom)', 'సూర్యవంశీ'(suryavanshi) ఉన్నాయి. ఈ రెండూ థియేటర్లలో విడుదలైతే ఒకప్పటి వైభవం థియేటర్లకు తిరిగి వస్తుందనే నమ్మకంలో చిత్రసీమ ఉంది. కానీ నెలల తరబడి విడుదల చేయడం కష్టంగా మారిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇవీ ఓటీటీ ఆలోచనలో పడ్డాయి.
అన్ని దారులు వెతుకుతున్నారా?
కరోనా తెచ్చిన కష్టం నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంతో కష్టపడి నిర్మించిన సినిమాలను విడుదల చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. 'బెల్ బాటమ్' చిత్రానిదీ ఇదే పరిస్థితి. "ఇన్ని రోజులూ థియేటర్ కోసమే చూశాం. కానీ క్లిష్ట పరిస్థితులు ఎక్కువ రోజులుగా కొనసాగుతున్నాయి. అందుకే విడుదల కోసం అన్ని దారులు చూస్తున్నాం. హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్.. ఈ రెండు ఓటీటీ సంస్థలతోనూ చర్చించాం. వీళ్లకి సినిమాని ప్రదర్శించాం కూడా. వాళ్లకు బాగా నచ్చింది. కానీ నిర్ణయం తీసుకోలేదు" అని 'బెల్ బాటమ్' చిత్రవర్గాలు చెప్పినట్టు సమాచారం.