తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వినోద 'వేణు' గానం మూగబోయింది

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ బుధవారం కన్నుమూశాడు. కొంతకాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయన... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్​ కన్నుమూత

By

Published : Sep 25, 2019, 12:48 PM IST

Updated : Oct 1, 2019, 11:15 PM IST

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ తీవ్ర అస్వస్థతకు గురై నేడు కన్నుమూశాడు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు...కిడ్నీ సమస్యలు రావడం వల్ల కుటుంబసభ్యులు ఈ నెల 6న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచి డయాలసిస్​ చేస్తున్నారు. మంగళవారం పరిస్థితి విషమించడం వల్ల ఐసీయూలో వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తుండగా... ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

హాస్యనటుడు వేణుమాధవ్​

మిమిక్రీ నుంచి హీరో...

సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించాడు వేణుమాధవ్. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ నటుడు... ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'సంప్రదాయం' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

  • చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న సమయంలో... పవన్‌కల్యాణ్‌ 'తొలిప్రేమ' చిత్రం వేణుమాధవ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.
  • ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక డిమాండ్‌ ఉన్న కమెడియన్లలో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించాడు.
  • ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే 'హంగామా' సినిమాతో కథానాయకుడిగా మారాడు. ఆ తర్వాత 'భూకైలాస్', 'ప్రేమాభిషేకం' వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత 'యువకుడు', 'దిల్', 'లక్ష్మి', 'సై', 'ఛత్రపతి','మాస్' చిత్రాలు కమెడియన్‌గా అతడి స్థాయిని మరింత పెంచాయి.

టాలీవుడ్​ ప్రముఖ కథానాయకులందరితోనూ ఆయన కనిపించాడు. 2006లో విక్టరీ వెంకటేష్​ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మి' సినిమాకు... ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డునూ అందుకున్నాడు. ఈ కమేడియన్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రాజకీయాల్లోనూ...

చిన్నప్పటి నుంచే మిమిక్రీ పట్ల ఆసక్తి కనబర్చే వేణుమాధవ్​... తాను చదువుతున్న కళాశాలలో ఒక రోజు ప్రదర్శన ఇవ్వగా... ఆ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే చందర్‌రావును విశేషంగా ఆకట్టుకుంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలకు అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత తన టాలెంట్​తో విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్​ దృష్టిలో పడ్డాడు.

హైదరాబాద్‌లోని తెదేపా కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్‌గా, అనంతరం టీడీఎల్పీ కార్యాలయంలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేశాడు. కొన్నాళ్లు ఎన్టీఆర్​ ఇంట్లో అసిస్టెంట్‌గానూ పనిచేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేశాడు వేణుమాధవ్‌.

Last Updated : Oct 1, 2019, 11:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details