తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ మూడు రోజులు మంచినీళ్లు తాగి..!'

సినిమా రంగంపై ఆసక్తితో ఇంజినీరింగ్​ విద్యను మధ్యలో వదిలేసి హైదరాబాద్​ వచ్చారు హాస్యనటుడు సత్య. దర్శకుడిగా స్థిరపడాలనే ధ్యేయంతో వచ్చిన ఆయన.. కెరీర్​ ప్రారంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట. భోజనానికి డబ్బుల్లేక మూడు రోజులు మంచినీళ్లతోనే పూట గడిపిన రోజులు ఉన్నాయని స్వయంగా ఆయనే వెల్లడించారు.

Comedian Satya about his struggles before entry into cine industry
ఆ మూడు రోజులు మంచినీళ్లు తాగి..!

By

Published : Jan 27, 2021, 7:10 PM IST

Updated : Jan 27, 2021, 7:33 PM IST

సినిమాల్లో నటించాలని, స్టార్‌గా ఎదగాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. సినిమా అంటే ఆసక్తి ఉన్న వారికి అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఆ సినిమా పురుగు కుట్టిందంటే కుదురుగా ఉండనివ్వదు. అలా రంగుల ప్రపంచంలోకి వచ్చి కష్టాలు పడిన వారెందరో. తాను కూడా అలాంటి కష్టాలే పడ్డానని అంటున్నారు హాస్యనటుడు సత్య. తనదైన కామెడీ టైమింగ్‌, నటనతో అలరిస్తున్నారాయన. అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అని అడిగితే, ఆయన ఏం చెప్పారో తెలుసా?

అద్దాలు తుడుస్తూ..

"దర్శకులు కె.విశ్వనాథ్‌, శంకర్‌, సుకుమార్‌ నాకు స్ఫూర్తి. వాళ్ల సినిమాల్ని ఎక్కువగా చూసేవాణ్ని. అప్పుడే నేనూ దర్శకుడు కావాలనుకున్నా. ఆ పిచ్చితో ఇంజినీరింగ్‌ మధ్యలోనే మానేసి హైదరాబాద్‌కు వచ్చా. మా ఇంట్లోవాళ్లు వచ్చి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయారు. కానీ నా ఆలోచనలు మారలేదు. నాన్న రూ.10 వేలు చేతిలో పెట్టి వెళ్లిపో అన్నారు. డబ్బులు తగ్గుతున్న కొద్దీ కంగారు. అప్పటికీ నాంపల్లిలో ఒక ఆస్పత్రి దగ్గర అద్దాలు తుడిచే పనికి ఒప్పుకొన్నా. రోజుకి రూ.200 ఇచ్చేవాళ్లు. నాలుగు రోజులు ఆ పని చేసుంటాను."

మూడు రోజులు మంచినీళ్లు

"ఓ రోజు రజనీకాంత్‌-శంకర్‌ కలయికలోని 'శివాజీ' సినిమా ట్రైలర్‌ చూపిస్తున్నారని తెలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో 'భూ కైలాస్‌' సినిమాకు వెళ్లా. అక్కడ ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు మాట్లాడుకోవడం విని పలకరించా. వాళ్లు 'రేపు షూటింగ్‌ దగ్గరికి వచ్చేయ్‌' అని అడ్రస్‌ చెప్పారు. అక్కడికెళ్లాక రూ.500 తీసుకొని చిత్రీకరణ జరుగుతున్న చోటుకు పంపించారు. అక్కడ జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య కూర్చుని చిత్రీకరణను చూశా. అక్కడే మరికొందరు పరిచయం అయ్యారు. వారితో 'నవ వసంతం', 'యమదొంగ' సినిమాల షూటింగ్​ వెళ్లా. జూనియర్‌ ఆర్టిస్టుల్లోనే ఒకరు నా దగ్గరున్న డబ్బు తీసుకొని వెళ్లిపోయాడు. మూడు రోజులు మంచినీళ్లు తాగి పడుకున్నా. ఆ బాధలో అమ్మకి ఫోన్‌ చేశా. నా గొంతు విని గుర్తు పట్టేసింది అమ్మ. నాన్నకు చెప్పడం వల్ల ఆయన వచ్చి తీసుకెళ్లారు. మా నాన్నకు స్నేహితుడైన చంటిగారి బంధువు నల్లశ్రీను దర్శకుడు రాజమౌళి దగ్గర మేకప్‌మెన్‌గా పనిచేస్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గరకు పంపించారు. ఆయనే నాకు 'ద్రోణ' సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేసే అవకాశాన్నిప్పించారు"

ప్రధానపాత్రలో

ఇటీవల విడుదలైన 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రంలో హీరో ఫ్రెండ్​ పాత్రలో మెప్పించారు. సత్య ప్రధానపాత్రలో 'వివాహ భోజనంబు' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి హీరో సందీప్​ కిషన్​ నిర్మాతగా వ్యవహరించారు. దీనితో పాటు 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌', 'శ్రీకారం' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:నాన్న మరణంతో కుంగిపోయా: లక్ష్మీరాయ్​

Last Updated : Jan 27, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details