హిందీ చిత్రసీమలో మరో ప్రేమ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్. కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ ప్రేమ పక్షులు... వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీళ్లిద్దరూ 'బ్రహ్మాస్త్ర' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇది ఈ ప్రేమ జంట కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడం వల్ల దీనిపై సినీప్రియుల్లో ఎనలేని ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తొలి చూపులు...
దశాబ్దం క్రితమే ఈ ప్రేమ జంటను తెరపై ఒకటిగా చూసే అవకాశం ఉండేదట. తాజాగా ఈ విషయాన్ని రణ్‌బీర్ ఓ కార్యక్రమంలో వెల్లడించాడు. దాదాపు పదేళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ హిందీ హిట్ చిత్రం 'బాలికా బధు'ను రణ్‌బీర్-ఆలియాలతో రీమేక్ చేయాలని ఈ స్టార్ డైరెక్టర్ ప్రణాళిక రచించాడట. అంతేకాదు అప్పట్లో వీళ్లిద్దరిపైనా ఓ ఫొటో షూట్ కూడా చేశారట. ఇది జరిగినప్పటికి రణ్‌బీర్ వయసు 20ఏళ్లు కాగా.. ఆలియా 11ఏళ్ల చిన్నారి.
ఆ సందర్భాన్ని ఆలియా గుర్తుచేసుకుంటూ.."అవును... మేమిద్దరం తొలిసారి ఆ ఫొటో షూట్ సమయంలోనే కలిశాం. ఆరోజు నాకు తన (రణ్‌బీర్) ముఖంలోకి చూస్తూ, ఆయన భుజాలపై చేతులు వేసి ఫొటోలు దిగడానికి చాలా సిగ్గనిపించింది" అని చిరునవ్వులు చిందించింది. మొత్తానికి ఈ జంటను అప్పట్లో తెరపై చూడలేకపోయినా.. ఆయాన్ ముఖర్జీ పుణ్యమా అని 'బ్రహ్మాస్త్ర'తో ఇన్నేళ్లకు ఆ కల తీరబోతుంది.