'గుండమ్మ కథ'లోని ఓ సన్నివేశంలో ఎన్టీఆర్, ఏయన్నార్ మధ్య డైలాగ్స్ ఉండవు. సీన్ మొత్తం కేవలం విజిల్స్‌తోనే నడుస్తుంది. సంభాషణా రచయిత డి.వి.నరసరాజు ఆ సీన్‌ను రాశారు. గుండమ్మ ఇంట్లో పనివాడిగా మారు వేషంలో ఉంటాడు ఎన్టీఆర్. ఓ రోజు ఆ ఇంటికి తన తమ్ముడు ఏయన్నార్ ప్రేయసి (జమున) కోసం వస్తాడు.
"ఇంట్లో నా ప్రేయసి ఉందా?" అని ఎన్టీఆర్‌ని అడుగుతాడు ఏఎన్నార్.. ఈ విధంగా మొదట సీన్ రాశాడు రచయిత నరసరాజు. అయితే 'ప్రేయసి' బరువైన మాట అనిపించి, 'ఇంట్లో నా పిట్ట ఉందా?' అని మార్చారట. 'పిట్ట' బాగోలేదని అనుకొని.. 'ఇంటో ఆమె (జమున) ఉందా?' అని స్ఫురించేలా ఏయన్నార్ ఈలతో అడిగినట్లు, వెంటనే 'ఉంది' అని ఎన్టీఆర్ ఈలతోనే సమాధానం చెప్పినట్టు రచయిత కథ రాశాడు.
ఇంటికి ప్రొడక్షన్ కారు రావడం వల్ల నరసరాజు ఆ పూటకి సగం సీన్ మాత్రమే రాసి, స్క్రిప్టును తీసుకెళ్లి విజయా స్టూడియోలో చక్రపాణికి చూపించారట. వెంటనే చక్రపాణి విజిల్స్‌తో సంభాషణ బాగుందని, సీన్‌లోని మిగిలిన భాగాన్ని అదే విధంగా కొనసాగించమని అన్నారట. నరసరాజు అలానే రాశారు. హాల్లో జనం అగ్రనటుల విజిల్స్ సీన్ చూసి చప్పట్లు కొట్టారు. రాసేటప్పుడు రచయిత సరైన మాట దొరక్క ఈల సౌండ్‌ను ఆశ్రయిస్తే... ఆ సీన్ సూపర్ హిట్ అయింది.
1962లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా... అగ్రశ్రేణి నటులతో రూపొందిన మల్టీ స్టారర్. సూర్యకాంతం పాత్ర ఆధారంగా ఈ సినిమాకు టైటిల్ పెట్టారు. హాస్యం, సంగీతం ప్రధానంగా చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు.