సినిమాటోగ్రాఫర్, స్క్రీన్‌రైటర్, దర్శకుడు, నిర్మాత.. ఇలా చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ గోపాల్‌రెడ్డి. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు ఈ వారం అతిథిగా విచ్చేసిన ఈయన తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా 1994-95లోనే హీరో నాగార్జునతో కలిసి పాన్ ఇండియా సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు గుర్తుచేసుకున్నారు. కానీ ఆ చిత్రం కొన్ని అనివార్య కారణాల ప్రారంభంలోనే నిలిచిపోయినట్లు వెల్లడించారు.
"సినిమాటోగ్రాఫర్ అయిన నా స్నేహితుడు ఒకరు యాక్షన్ కథ రాసుకున్నాడు. అతడే ఈ కథకు దర్శకత్వం వహించాలనుకున్నాడు. ఆ కథ నాకు చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. హీరో నాగార్జునతో ఈ సినిమా చేయాలనుకున్నాం. అప్పటికే 'హలో బ్రదర్' చిత్రం అయిపోయింది. డింపుల్ కపాడియా, నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్‌ను తీసుకోవాలనుకున్నాం. సినిమా తీయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశాం. మరో నెలరోజుల్లో చిత్రీకరణ ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో ఆపేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే.. చివరి సీక్వెన్స్ మార్చాలని నాగ్‌తో పాటు మిగతావారు అడిగారు. కానీ దర్శకుడు ఒప్పుకోలేదు. అలా ఈ సినిమాను పక్కనపెట్టాల్సి వచ్చింది." అని గోపాల్ పేర్కొన్నారు.