మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది దీపావళి పండుగకు థియేటర్లలో సందడి చేస్తుందని ప్రకటించింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం నెలలపాటు కఠిన కసరత్తులు చేసి మరీ ప్రొఫెషనల్ బాక్సర్ అవతారంలోకి మారారు వరుణ్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాణంలో యాంథాలజీ సినిమా 'మీట్ క్యూట్' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఆయన సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆరుగురు నటులు, ఆరుగురు నటీమణులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిలో సత్యరాజ్, ఆకాంక్ష సింగ్, అదాశర్మ, రోహిణి తదితరులు ఉన్నారు.
సోనూ సూద్, నిధి అగర్వాల్ జంటగా ఓ హిందీ గీతం రూపొందుతోంది. ఫరాఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ పాటకు సంబంధించిన టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. 'సాత్ క్యా' అంటూ సాగే ఈ గీతాన్ని స్వీయ సంగీత దర్శకత్వంలో టోనీ కక్కడ్ రచించారు. ఫరాఖాన్ కొరియోగ్రఫీ. పూర్తి వీడియో ఆగస్టు 9న విడుదల కానుంది. 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూ ఇయర్', 'మై హూనా' తదితర చిత్రాల దర్శకురాలే ఫరాఖాన్. కొరియోగ్రాఫర్, నటి, నిర్మాతగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె.