కెమెరా కన్ను తెరుచుకుంటే చాలు... సినీ స్వప్నాలన్నీ సాకారమైనట్టే. క్లాప్ బోర్డు చప్పుడు సినిమావాళ్ల పాలిట గుండె చప్పుడే. ట్రాలీ కదిలిందంటే... జీవితాలూ రయ్ రయ్‌మంటూ ముందుకు దూసుకెళ్లినట్టే. సినిమా సెట్ ఎంత కళగా ఉంటే... చిత్ర పరిశ్రమలో అంత సందడి కనిపిస్తుంటుంది. కొత్త సినిమా ప్రారంభోత్సవాలు, చిత్రీకరణలు, వేడుకలు, విడుదలలు, విజయోత్సవాలు... ఇలా ఎప్పుడూ హడావుడే.
అలాంటి చిత్రసీమ నెలలపాటు స్తబ్దుగా ఉండిపోవల్సి వచ్చింది. లైట్స్, కెమెరా, యాక్షన్... అనే మాటలు మళ్లీ ఎప్పుడు వినిపిస్తాయో అన్నట్టుగా ఎదురు చూస్తూ వచ్చింది చిత్రసీమ. ప్రేక్షకుడు పెద్ద తెరపై బొమ్మ చూసి, ఈల వేసి చప్పట్లు కొట్టడానికి ఇంకా సమయం పడుతుందేమో కానీ... చిత్రీకరణలు మాత్రం వచ్చే నెలలోనే షురూ కాబోతున్నాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. థియేటర్లోనో, లేదంటే ఓటీటీ విడుదల... పరిస్థితుల్ని బట్టి అడుగేయొచ్చు కానీ ముందు నిర్మాణానంతర పనులైతే పూర్తి చేసుకుందామని వాటిపై దృష్టి పెట్టారు.
ఒకొక్కటిగా..
వేసవి వచ్చిందంటే చాలు... విదేశాల్లో పాటల చిత్రీకరణ.. లేదంటే స్టూడియోలోనే షూటింగ్.. ఆ రెండూ కుదరలేదంటే విరామమో తీసుకోవడం హీరోలకు పరిపాటి. కానీ ఈసారి లాక్‌డౌన్‌తో విరామం వచ్చింది. రెండు నెలలుగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడిక బయటికి రావల్సిందే అని నిర్ణయించుకున్నారు హీరోలు. మండే ఎండల్ని లెక్క చేయకుండా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఎప్పుడు చిత్రీకరణలు ప్రారంభిస్తే అప్పుడు మేం రావడానికి సిద్ధం అని దర్శకనిర్మాతలకి చెప్పేశారు. కరోనా భయాల మధ్య హీరోహీరోయిన్లు చిత్రీకరణలకి ఒప్పుకుంటారో లేదో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ సింహ భాగం నటులు తగిన జాగ్రత్తలు తీసుకుని రంగంలోకి దిగాలనే నిర్ణయించారు.
ఇప్పటికే పలు చిత్రాలు విడుదల తేదీల్ని ఖరారు చేశాయి. ఎలాగైనా ఆ తేదీల్ని అందుకోవాలనే లక్ష్యంతో రంగంలోకి దిగుతున్నాయి ఆయా చిత్రబృందాలు. అది సాధ్యమవుతుందో లేదో కానీ... చిత్రీకరణల కోసం ప్రణాళికల్ని మాత్రం పక్కాగా సిద్ధం చేశాయి. చిత్రీకరణలకు అనుమతులు లభించిన వెంటనే రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' మొదలు కానుంది. ఆ మేరకు అందులో నటిస్తున్న హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ పచ్చజెండా ఊపేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' తొలి వరసలో పట్టాలెక్కే సినిమానే.
పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్', నాగార్జున 'వైల్డ్‌డాగ్', వెంకటేష్ 'నారప్ప', ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం... ఇవన్నీ సగానికి పైగానే పూర్తయ్యాయి. రవితేజ 'క్రాక్', రానా 'విరాటపర్వం', నాగచైతన్య 'లవ్‌స్టోరీ', శర్వానంద్ 'శ్రీకారం', సాయిధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటరూ', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', నితిన్ 'రంగ్‌దే', మంచు విష్ణు 'మోసగాళ్లు', బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్', అల్లరి నరేష్ 'నాంది' చిత్రాలు తుదిదశకు చేరుకున్నాయి. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు కాబట్టి ఒకొక్కటిగా వరుసగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఒక సినిమా ఎక్కువ రోజులు సెట్స్‌పై ఉందంటే దానిపైన పెట్టుబడులు, వాటి వడ్డీలు నిర్మాతలకి భారంగా మారే ప్రమాదం ఉంటుంది.