వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) వసూలు... రెవెన్యూ షేరింగ్ తదితర విషయాలపై మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలకీ, నిర్మాతలకీ మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. నిర్మాతల డిమాండ్లను మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అంగీకరించకపోవడం వల్ల చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ విషయంపై నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే కొత్త సినిమాల్ని విడుదల చేయమని నిర్మాతలు తెగేసి చెప్పినట్టు సమాచారం. దాంతో క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల కావల్సిన సినిమాలపై సందిగ్ధత కొనసాగుతోంది.
కొత్త చిత్రాలు విడుదల చేసే ముందు తమ సమస్యలు పరిష్కారం కావాలని, డిమాండ్లను మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అంగీకరించాల్సిందేనని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కోరుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ షేరింగ్ ఒకేలా ఉండాలనీ, రెవెన్యూలో నిర్మాతలకు ఎక్కువ భాగం ఇవ్వాలని, నిర్మాతల నుంచి వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) వసూలు చేయకూడదని, ప్రదర్శనల్లో ప్రాధాన్యం తెలుగు సినిమాలకే ఇవ్వాలని... ఇలా నిర్మాతల నుంచి పలు డిమాండ్లు ఉన్నాయి. వీటిని అంగీకరించడానికి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ససేమిరా అంటుండడం వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది.