వెండితెరపై హీరోయిజం పండించడానికి కథానాయకులకు ఎన్ని తరహా పాత్రలైనా దొరకొచ్చు. కానీ, సినీప్రియుల మదిలో రియల్ హీరోగా ముద్ర వేయించుకోవాలనుకున్న ప్రతిసారీ వాళ్లు చూసేది పోలీస్ కథలవైపే. మాస్ హీరోగా విలన్ గ్యాంగ్‌ను చితక్కొట్టినా.. ఫ్యాక్షనిస్టుగా తొడగొట్టి శత్రుమూకల గుండెల్లో రైళ్లు పరుగెత్తించినా.. చారిత్రక యోధుడిగా కత్తి యుద్ధాలతో వందల మందిని మట్టికరిపించినా.. తమ అభిమాన హీరో ఖాకీ చొక్కా ధరించి ప్రతినాయకుల ముందు లాఠీతో ఠీవిగా నిలబడితే చాలు మురిసిపోతుంటారు సినీప్రియులు.
అందుకే మంచి కథ దొరికినప్పుడల్లా తెలుగు కథా నాయకులు యూనీఫాంతో తెరపై అడుగుపెట్టేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ విశేషాలేంటో చదివేయండి..
పోలీస్ కథలు వెండితెరకు దొరికిన ఎవర్‌గ్రీన్ హిట్ ఫార్ములా. ఈ ఖాకీ కథలతోనే సినీప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్టార్లు ఉన్నారు. ఎన్టీఆర్, ఏయన్నార్‌ల కాలం నుంచి తెలుగు తెరపై పోలీస్ కథలు సందడి చేస్తున్నప్పటికీ.. ఈ కథలతో స్టార్లుగా పేరు తెచ్చుకున్న వాళ్లలో సినీప్రియులకు బాగా గుర్తుండేది సాయికుమార్, విజయశాంతి, శ్రీహరి లాంటి వారే. నేటి తరానికి వస్తే పోలీస్ కథలతో ఎక్కువగా సత్తా చాటిన వాళ్లలో రవితేజ, ఎన్టీఆర్ (బాద్‌షా), పవన్ కల్యాణ్ (గబ్బర్‌సింగ్), మహేష్‌బాబు (పోకిరి, దూకుడు), రామ్‌చరణ్ (ధృవ) లాంటి స్టార్లే గుర్తొస్తారు.
ఎక్కువగా ఈయనే
ఈతరంలో అందరి కంటే ఎక్కువసార్లు ఖాకీ చొక్కా తొడిగింది రవితేజనే. 'విక్రమార్కుడు', 'ఖతర్నాక్', 'మిరపకాయ్', 'పవర్', 'టచ్ చేసి చూడు' వంటి చిత్రాల్లో పూర్తిస్థాయి పోలీస్‌గా మురిపించిన ఈ మాస్‌రాజా.. 'ఇడియట్', 'వెంకీ', 'కిక్' తదితర చిత్రాల్లో ఆఖరికి ఖాకీ చొక్కా తొడిగినట్లుగానే చూపిస్తారు.
ఇప్పుడాయన 'క్రాక్' చిత్రంతో వెండితెరపైకి మరోసారి యూనీఫాంలో అడుగుపెట్టబోతున్నారు. 'బలుపు' వంటి హిట్ తర్వాత గోపీచంద్ మలినేని - రవితేజల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది.
చెర్రీ.. ముచ్చటగా మూడోసారి
మంచి కథ పడితే చాలు ఖాకీ దమ్ము చూపించడానికి సిద్ధంగా ఉంటారు కథానాయకుడు రామ్‌చరణ్. ఇప్పటికే ఆయన 'తుపాన్', 'ధృవ' చిత్రాల్లో పోలీస్‌గా అలరించారు. వీటిలో 'ధృవ' విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఆయన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంతో మరోసారి పోలీస్ అవతారమెత్తుతున్నారు.