దాదాపు ఏడు నెలల తర్వాత అక్టోబరు 15 నుంచి సినిమాహాళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయని ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మంగళవారం వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లలో సీటుకు సీటుకు మధ్య దూరంతో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించేందుకు కేంద్రం ఇటీవలే పచ్చజెండా ఊపింది. దీనిపై తాజాగా సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మాట్లాడారు.
"గత ఏడు నెలలుగా సినిమా హాళ్లు మూసేసి ఉన్నాయి. అక్టోబరు 15 నుంచి అవి తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సూచించిన నియమాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సీటుకు సీటుకు మధ్య దూరంతో 50 శాతం సామర్థ్యంతో హాళ్లు నడుపుకోవచ్చు".
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర ప్రసారశాఖ మంత్రి
సినిమా హాళ్లు/మల్టీప్లెక్స్‌లు పాటించాల్సిన నియమాలు:
- సీట్లకు మధ్య గ్యాప్‌తో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి.
- ఆన్లైన్లో టికెట్లు విక్రయించేందుకు ప్రాధాన్యం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ కౌంటర్లు తెరిచి ఉంటాయి.
- సినిమాకు వచ్చిన వారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ నడుచుకోవాల్సి ఉంటుంది.
- సందర్శకులు, సిబ్బంది లోపలికి వచ్చే ముందు ఎంట్రీ పాయింట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులనే లోపలికి అనుమతించాలి.
- అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో పాటు పనిచేసే ప్రదేశాల్లోనూ శానిటేజర్ అందుబాటులో ఉంచాలి.
- సరైన వెంటిలేషన్ ఉండేలా థియేటర్ యాజమాన్యం జాగ్రత్తలు వహించడం సహా ఎయిర్ కండిషనింగ్ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండాలి.
- మల్టీప్లెక్స్‌లలోని వివిధ స్క్రీన్ల ప్రదర్శనల మధ్య తగిన వ్యవధి ఉండాలి. ఒకే సమయంలో ప్రేక్షకులు బయటకు రాకుండా ప్రణాళికలను రూపొందించి.. ఆ విధంగా ప్రదర్శనలు నిర్వహించాలి.
- ప్యాక్ చేసిన ఆహారం, పానీయాలను మాత్రమే అనుమతించాలి. అన్ని కౌంటర్ల వద్ద ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలి.
- థియేటర్ స్క్రీన్ లోపల ఆహారాన్ని డెలివరీ చేయడం నిషేధం.
- ఆరోగ్యసేతు మొబైల్ యాప్ వాడాలని సూచించాలి.
- విరామ సమయంలో సాధారణ ప్రాంతాలు, లాబీలు, వాష్‌రూమ్‌లలో రద్దీని నివారించడానికి, వరుస పద్ధతిలో ప్రేక్షకులను అనుమతించడం వంటివి చేయొచ్చు. దాని వల్ల ఎక్కువ విరామ సమయం వెచ్చించాల్సి ఉంటుంది.
- ఒక షో పూర్తయ్యాక మరొక షో ప్రదర్శించే ముందు.. సీట్లను తప్పకుండా శానిటైజేషన్ చేయాలి.