తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిరీక్షణకు 'తెర'.. ప్రదర్శనలు షురూ - అక్టోబరు 15 నుంచి థియేటర్లకు అనుమతి

దేశవ్యాప్తంగా నేటి (గురువారం) నుంచి సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. కొన్ని రాష్ట్రాల థియేటర్లలో మినహా మిగిలిన వాటిల్లో చిత్రప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు ఆరోగ్య భద్రత కోసం థియేటర్​ యాజమాన్యాలు తగు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.

cinema-halls-to-reopen-today-with-covid-19-protocols-in-place
నిరీక్షణకు 'తెర' పడింది.. చిత్రప్రదర్శనలు మొదలయ్యాయి

By

Published : Oct 15, 2020, 5:35 PM IST

Updated : Oct 15, 2020, 5:49 PM IST

దాదాపు ఏడు నెలల విరామం తర్వాత దేశంలోని పలుప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. అన్​లాక్-5లో భాగంగా సినిమా హాళ్లను అక్టోబరు 15 నుంచి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్స్​లో కాంటాక్ట్​లెస్​ సినిమా చూసే కొత్త శకానికి నాంది పలికినట్లైంది. అయితే హాళ్లను తెరిచేందుకు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర ప్రభుత్వాలు విముఖత చూపాయి.

చిత్రప్రదర్శనలు షురూ

దిల్లీ, మధ్యప్రదేశ్​, గుజరాత్​ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేటి నుంచి చిత్రప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. 'చిచ్చోరే', 'తప్పాడ్​', 'తాన్హాజీ', 'ది స్పై' వంటి ప్రాంతీయ, ఇంగ్లీష్​, హిందీ చిత్రాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ పోలీస్​, ఐనాక్స్​లలో గురువారం నుంచి ప్రదర్శన మొదలైంది. వీటిలో తగిన ఆరోగ్య భద్రతా చర్యలకు ప్రాధాన్యమివ్వడం సహా, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ​

థియేటర్

రేపటి నుంచి పీవీఆర్ ఓపెన్

దేశవ్యాప్తంగా 71 నగరాల్లో 176 మల్టీప్లెక్స్​లలోని 845 స్క్రీన్లతో అతిపెద్ద ఫిల్మ్​ ఎగ్జిబిటర్​గా పీవీఆర్​ సినిమాస్​ ఉంది. 10 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 487 తెరలలో చిత్ర ప్రదర్శన చేయడానికి ముందుకొచ్చింది పీవీఆర్​ సంస్థ. ఈ మల్టీప్లెక్స్​లు శుక్రవారం నుంచి తెరచుకోనున్నాయి.

ఆరోగ్య భద్రతా చర్యలు పాటిస్తున్నాం

కోల్​కతాలోని ఐనాక్స్​ ప్రతినిధి మాట్లాడుతూ.. "ఈ-టికెట్లు, కాంటాక్ట్​లెస్​ క్యూఆర్​ ఆధారిత ఎంట్రీలతో సహా కేంద్రం జారీ చేసిన అన్ని మార్గదర్శకాల అనుగుణంగా గురువారం చిత్రప్రదర్శనలు ప్రారంభించాం. జ్వరం లక్షణాలు ఉన్నవారిని వెనక్కి పంపించాం. ప్రదర్శన సమయం, విరామానికి, నిష్క్రమణల వేళల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆరు అడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం" అని తెలిపారు.

థియేటర్

తెలుగు రాష్ట్రాల మాటేమిటి?

తెలుగు సినిమాకు కీలకమైన సంక్రాంతిలోపు థియేటర్ల వ్యవస్థ గాడిన పడాలంటే ఇప్పుడు తెరవాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. నవంబరు 1 నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సినీ ప్రదర్శనకు అనుమతులు లభిస్తాయనే ఆశతో ఉన్నామని ఓ ప్రదర్శనకారుడు చెప్పారు. ఏపీలో విద్యుత్‌ బిల్లులు, ఆస్తిపన్ను, జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఉపశమనం కల్పించాలని ప్రదర్శనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఎగ్జిబిటర్లు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. మరి ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి.

సినిమాల్ని విడుదల చేయడం కోసం నిర్మాతల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడింగ్‌ సంస్థలు కూడా రాయితీల్ని ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజ్‌లో నిర్మాతల నుంచి 50 శాతం మాత్రమే వసూలు చేయనున్నట్టు క్యూబ్‌ ప్రకటించింది.

థియేటర్

కేంద్రం మార్గదర్శకాలు

కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం థియేటర్లలో 50 శాతం వరకు సీటింగ్​కు హోంమంత్రిత్వ శాఖ అనుమతించింది. కేంద్రం విడుదల చేసిన ప్రామాణిక ఆపరేటింగ్​ విధానాలను ఖచ్చితంగా పాటించాలి. సీటింగ్​తో పాటు ప్రతి ఒక్కరూ తప్పక మాస్క్ ధరించాలి. సరైన వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్​ సెట్టింగులలో 23 డిగ్రీల సెల్సియస్​కు తగ్గకూడదు. థియేటర్లలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ థర్మల్​ స్క్రీనింగ్​తో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, టికెట్లకు బదులుగా డిజిటల్ టికెట్స్​ వంటివి విధిగా పాటించాలి. అయితే అక్టోబరు 15 నుంచి సినిమాహాళ్లు, పాఠశాలలు, కళాశాలలు తెరవడానికి కేంద్రం అనుమతించినా.. వాటిపై తుదినిర్ణయం రాష్ట్రాలకే వదిలేసింది.

Last Updated : Oct 15, 2020, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details