కరోనాపై సమరాన్ని సాగిస్తున్న సమయమిది. మీరు ఇళ్లల్లో గడపండి, మీ ఆరోగ్యం బాధ్యతని మేం తీసుకుంటామని భరోసానిస్తూ.. వైద్యులు, ప్రభుత్వ యంత్రాగం, పారిశుద్ధ్య కార్మికులు చెమటోడుస్తున్నారు. వెండి తెరపై వెలుగుతూ... సమాజంలో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న సినీ తారలు మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల్ని కచ్చితంగా పాటిస్తూనే... సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా గురించి అవగాహన పెంపొందిస్తూ చైతన్యం నింపుతున్నారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐ.ఐ.హెచ్.ఎఫ్.డబ్ల్యు)- తెలంగాణ శాఖ సంయుక్తంగా విడుదల చేసిన కొన్ని ప్రకటనల్లో.. పలువురు సినీ తారలు విలువైన సలహాలు, సూచనలు అందజేశారు.
"మీకూ చాలా పనులు ఉంటాయి. కొంత మందికి అత్యవసరాలు ఉంటాయి. కాబట్టి తప్పదు అనుకుంటేనే బయటకి వెళ్లండి. వెళ్లినా జాగ్రత్తలు పాటించండి. శానిటైజర్స్ పట్టుకెళ్లండి. తరచూ చేతులు కడుక్కుందాం. చేతులతో కళ్లను, ముఖాన్ని తాకొద్దు. మీరు సురక్షితంగా ఉంటే అందరూ సురక్షితంగా ఉన్నట్లే".
-- రానా దగ్గుబాటి, కథానాయకుడు
"24 గంటలు తీరిక లేకుండా గడిపే మనకు ఇదొక చెక్ పాయింట్. మన ఇంట్లో వాళ్లతో మనసు విప్పి మాట్లాడుకోవడానికి, వంట చేసుకుంటూ.. మీ తల్లిదండ్రులు, పిల్లలు, పెంపుడు జంతువులతో, చక్కటి ఆరోగ్యాన్నిచ్చే చుట్టూ ఉన్న మొక్కలతో గడపడానికి ఇదొక సువర్ణావకాశం. మీరు చదువాలనుకుంటున్న పుస్తకాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు చూడాలనుకున్న టీవీ కార్యక్రమాలు రమ్మంటున్నాయి. సురక్షితంగా ఉంటూ రేపటి అందమైన భవిష్యత్తు కోసం ఈ సమయాన్ని హాయిగా ఇంట్లోనే గడిపేయండి".
-- మంచు లక్ష్మీ ప్రసన్న, కథానాయిక
"మన ఆరోగ్యం.. మన చుట్టూ ఉన్న వారి ఆరోగ్యంతోనే ముడిపడి ఉంటుంది. పని వాళ్లకి, డ్రైవర్లకి, ఇతర సహాయ సిబ్బందికి వాళ్ల ఇళ్లల్లోనే ఉండమని చెబుదాం. కంగారు పడక్కర్లేదు, పూర్తి వేతనం ఇస్తామని వారికి భరోసా ఇవ్వాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మొత్తం ప్రపంచ ఆరోగ్యం, రక్షణ బాధ్యత మన చేతుల్లోనే ఉంది".
-- సుధీర్‌బాబు, కథానాయకుడు
"అందరూ సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తున్నారని ఆశిస్తున్నా. ప్రత్యేకంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు, మధుమేహ బాధితులు, గుండె జబ్బు, బీపీ, టీబీ, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్లంతా కచ్చితంగా బయటకు వెళ్లడం మానేయ్యాలి. ఈ సమయాన్ని ప్రియమైన కుటుంబ సభ్యులతో గడుపుదాం".