ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంలో ప్రసిద్ధి చెందారు. దాదాపు 2000 పాటలు రాసి సినీ అభిమానుల్ని అలరించారు. గతంలో ఆయనతో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం.
* నమస్కారం వెన్నెలకంటి గారూ! మీ నేపథ్యం గురించి చెప్తారా?
నమస్కారం. నేను నెల్లూరులో పట్టభద్రుణ్ణి అయ్యాక ఓ పుష్కర కాలం భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగం చేశాను. నాకు పద్యరచన మీద మమకారముండేది. నా 11వ ఏట.. 'భక్త దుఃఖనాశ పార్వతీశా' అనే మకుటంతో శతకాన్ని రాశాను. అలా విద్యార్థి దశలో 'రామచంద్ర శతకం', 'లలితా శతకం' కూడా రాశాను. కానీ, నా మనసంతా నాటకాల మీద, సినిమాల మీదే ఉండేది. నాటకాలు వేస్తుండేవాణ్ణి. ఎప్పటికైనా సినిమాలో పాటలు రాయకపోతానా! అనే ఆత్మ విశ్వాసముండేది. అదే నన్ను సినీ గేయ రచయితగా నిలబెట్టింది.
* సినిమా రంగానికి ఎలా పరిచయమయ్యారు?
మా ఊరికి మద్రాసు (చెన్నై) దగ్గర కావడం వల్ల సరదాగా అక్కడకు వెళ్తుండేవాణ్ణి. 1986లో నటుడు, నిర్మాత ప్రభాకరరెడ్డి 'శ్రీరామచంద్రుడు' సినిమాలో 'చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల' పాట రాసే అవకాశమిచ్చారు. అదే నా తొలి సినీగీతం. 1987లో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో 'అన్నా చెల్లెలు' సినిమాకు 'అందాలు ఆవురావురన్నాయి' పాట రాశాను. అలా నా పాటల ప్రయాణం మెల్లిగా ఊపందుకుంది. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సినిమా రంగంలో సాహిత్య ప్రయాణం చేస్తున్నాను.
* స్ట్రైయిట్ చిత్రాలతో మీ ప్రస్థానం మొదలైంది కదా? కొన్ని పాటల విశేషాలు చెబుతారా?
'మహర్షి' (1988) సినిమాలో 'మాటరాని మౌనమిది' గురించి. మాటల్లో పేర్చలేని, పదాల్లో ఇమడ్చలేని ప్రేమభావాలను ఆవిష్కరించిన ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామ్మూర్తి నాకు గురుతుల్యులు. వారి స్ఫూర్తితో స్రవంతి రవికిషోర్, వంశీ సూచన మేరకు 'ముక్తపదగ్రస్థం' వచ్చేట్టు ఒక పాటను, మామూలు వర్షన్‌లో వచ్చేలా మరొక పాటను రాశాను. 'ముక్తపదగ్రస్థం' అంటే మొదటి పంక్తిలో చివరి పదాన్ని రెండో పంక్తిలో మొదటి పదంగా వాడటమన్నమాట. సన్నివేశానికి తగిన చరణాలను ఎంపిక చేసినప్పుడు రవికిషోర్ రెండో వర్షన్ చరణాలను వాడుకున్నారు. పల్లవి మాత్రం అలాగే ఉంచేశారు. 'మాటరాని మౌనమిది... మౌనవీణ గానమిది.. గానమిదీ నీ ధ్యానమిది.. ధ్యానములో నా ప్రాణమిదీ.. ప్రాణమైన మూగ గుండె రాగమిది' అనే ఈ పాట బాగా హిట్ అయింది. 'ముత్యాల పాటల్లో కోయిలమ్మా.. ముద్దారబోసేది ఎప్పుడమ్మా.. ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా.. దీపాలు పెట్టేది ఎప్పుడమ్మా' చరణంతో నిర్మాత బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇళయరాజా అద్భుతంగా ఈ పాటను స్వరపరిచారు. ఈ పాట హిట్ అవడం వల్ల రవికిషోర్ నాకు 'నాయకుడు' డబ్బింగ్ వర్షన్‌లో రెండు పాటలు రాసే అవకాశాన్ని ప్రోత్సహించారు.
* 1989లో వచ్చిన వంశీ సినిమా 'చెట్టుకింద ప్లీడరు'కు రెండు పాటలు రాశారు కదా. వాటి వివరాలు..
బాలు, చిత్ర పాడిన 'చల్తీకా నామ్ గాడీ.. చలాకీ వన్నె లేడీ.. రంగేళి జోడీ.. బంగారు బాడీ.. వేగంలో చేసెను దాడీ.. వేడెక్కి ఆగెను ఓడి.. అహో.. ఇక ముప్పల తిప్పలు తప్పవా తప్పవా' అనే పాట సందర్భానికి రాసిన సరదా పాట. ఈ పాటలో హీరో ఒక డొక్కు కారును గురించి భట్రాజు పొగడ్తలు చెప్పడమే ఉద్దేశం. 'అశోకుడు యుద్ధంలోన వాడింది ఈ కారు.. శివాజీ గుర్రం వీడీ ఎక్కింది ఈ కారు' అంటూ చరణంలో పలికే ప్రగల్భాలు సినిమాలో బాగా పండాయి. ఈ పాటనే స్ఫూర్తిగా తీసుకొని ఆరేళ్ల విరామం తర్వాత 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాలో వంశీ.. 'వెన్నెల్లో హాయ్.. హాయ్' పాటను చక్రి చేత ట్యూన్ చేయించుకున్నారు. రెండవ పాట 'అల్లిబిల్లి కలలా రావే.. అల్లుకున్న కథలా రావే.. మల్లెపూల చినుకై రావే.. పల్లవించి పలుకై రావే' అంటూ సాగే సాధారణ ప్రేమ గీతం. ఇందులో 'జావళీలు పాడే జాణ.. జాబిలమ్మ తానై' అనే ప్రయోగం వంశీకి ఎంతో నచ్చింది.
* మరో వంశీ సినిమా 'ఏప్రిల్ 1 విడుదల' సినిమా గురించి..
ఈ సినిమాలో మొదట సిరివెన్నెల చేత 'నిజమంటే నిప్పేకాదా.. ముట్టుకుంటే చుట్టుకోదా మంటా' అనే పాటను రాయించారు. ఈ పాట రికార్డు కూడా విడుదలైంది. వంశీ ఆలోచన భిన్నంగా ఉంటుంది. అతనికి వైవిధ్యం కావాలి. ప్రాస కుదరాలి. 'మంచీ-చెడు' సినిమాలో ఆత్రేయ రాసిన 'రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి.. నీ కంటి చూపుల వెంట నా పరుగంటి' పాటలా సాగిపోవాలి అంటూ వంశీ రెండు చరణాలకు రెండు సీన్లు ఇచ్చారు. పాట డైలాగుల్లా కాకుండా పాట రూపంలో ఆ రెండు సీన్లు రావాలి అని షరతుపెట్టి, పాట రాయమన్నారు. అన్నీ నిజాలే చెప్తే వచ్చే అనర్ధాలను పాట రూపంలో చెప్పాను. 'మాటంటే మాటేనంట.. కంటబడ్డ నిజమంతా అంటా - రుజువంటూ దొరికిందంటే.. గంట కొట్టి చాటేస్తూ ఉంటా' అనే పల్లవిని రాజేంద్రప్రసాద్‌కు, 'నిజమంటే తంటాలంటా.. నిక్కుతుంటే తిక్క దిగుతాదంటా.. మొదలంటూ చెడతావంట.. వెంటబడి తెగ తంతారంట' అనే పల్లవిని శోభనకు రాశాను. చూస్తున్నదే వింటున్నట్లు, వింటున్నదే చూస్తున్నట్లు రాయడం వల్ల ఆ పాట బాగా పాపులర్ అయ్యింది.
* చందమామ - విజయా వారి 'బృందావనం' (1992)లో పాటల విశిష్టత ఏమైనా..
సంగీతానికి ఇంటిపేరు సాహిత్యం అని నా అభిప్రాయం. ఈ నానుడి విజయా వారు నిర్మించిన అన్ని సినిమాలకూ వర్తిస్తుంది. సంగీత దర్శకుడు మాధవపెద్ది రమేష్ 'షిర్డీ సాయి' ఆల్బమ్ కోసం నాతో నాలుగు పాటలు రాయించారు. ఆ పాటల సాహిత్యం విన్న సింగీతం శ్రీనివాసరావు నేను రాసిన పాటల్లో 'ఆత్మ' ఉందని మెచ్చుకున్నారట. అలా నాకు 'బృందావనం' సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. 17 ఏళ్ల విరామం తర్వాత విజయా వారు నిర్మించిన ఈ సినిమాకు పాటలు నేనే రాశాను. మహానుభావులు పింగళి, ఘంటసాల, పెండ్యాల కూర్చొని పాటలు రాసి మట్లు కట్టిన చారిత్రాత్మక గదిలో కూర్చొని నేను పాటలు రాసినప్పుడు ఒళ్లు పులకించింది. ఈ పాటలకు స్వరాలు అల్లడానికి నలభై రోజులు పట్టింది. ముఖ్యంగా 'మధురమే సుధా గానం.. మనకిదే మరో ప్రాణం.. మదిలో మోహన రాగం.. మెదిలే తొలి సంగీతం' పాట విజయా వారి 'ట్రేడ్ మార్క్' పాటగా గుర్తింపు తెచ్చుకుంది. 'ఓహో ఓహో బుల్లి పావురమా.. అయ్యో పాపం అంటే అది నేరమా.. అతివలకింత పంతమా.. అలకలు వారి సొంతమా' అంటూ బాలు, 'పదే పదే వెటకారమా.. అతివలు అంత సులభమా.. శ్రుతి ఇంక మించనీకుమా' అని జానకి ఆలపిస్తారు. ఈ వరసలు విన్న రావి కొండలరావు, సింగీతం శ్రీనివాసరావు, బాబ్జీ.. 'అబ్బా! మళ్లీ పింగళి గారు కనిపిస్తున్నారయ్యా' అంటూ మిస్సమ్మ సినిమాలో పింగళివారి 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' పాటను గుర్తు చేసుకున్నారు. అంతకు మించిన అవార్డు నాకేం కావాలి? 'ఆ రోజు నారాణి', 'అబ్బో ఏమివింత', 'మా మామయ్యా' పాటలు కూడా బాగా హిట్ అయినవే! సింగీతం దర్శకత్వం నిర్వహించిన 'ఆదిత్య 369'లో నేను రాసిన 'రాసలీల వేళ రాయబారమేలా.. మాటే మౌనమై మాయజేయ నేలా' పాటను సాధన చేసి రికార్డింగ్‌కు సిద్ధమౌతూ బాలు, సింగీతంతో.. 'ఈ పాట చాలా బాగా వచ్చిందండీ' అంటే.. సింగీతం 'నేను ఈ కుర్రాణ్ణి చెడగొడదామనుకున్నాను. అతను చెడిపోకపోగా చాలా అద్భుతంగా పాట రాశాడు. నాకు పింగళి గారితో రాయించుకున్న ఫీలింగు కలుగుతోంది' అన్నారు. అది నాకు గొప్ప ప్రశంసాపత్రం!!
* కళాతపస్వి విశ్వనాథ్ సినిమా 'స్వాతికిరణం' (1992)కు ఒక పాట రాశారు కదా..?
సి.నా.రె., సిరివెన్నెల కలిసి ఈ సినిమాకు 11 పాటలు రాశారు. విశ్వనాథ్ నన్ను పిలిచి 'ఈ సినిమాలో ప్రధానమైన పాటలన్నీ అయిపోయాయి. బాలనటుడు చెట్లవెంటా, గట్లమీదా తిరుగుతూ పాడుకునే ఒక పాట నువ్వు రాయాలి' అన్నప్పుడు 'మహద్భాగ్యం' అనుకున్నాను. విశ్వనాథ్‌తో పనిచెయ్యడమే ఒక వరం. ఆయన సినిమాకు పాట రాయడం అదే నాకు తొలిసారి. 'కొండా కోనల్లో లోయల్లో.. గోదారి గంగమ్మా సాయల్లో.. కోరి కోరి కూసింది కోయిలమ్మ..' అని పల్లవి మొదలెట్టి 'నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా.. రివ్వున గువ్వే సాగంగా.. నవ్వే మువ్వై మోగంగా.. ఉంగా ఉంగా రాగంగా.. ఉల్లాసాలే ఊరంగా.. ఊపిరి ఊయలలూగంగా.. రేపటి ఆశలు తీరంగా.. తెనుగుతనం నోరూరంగా... తేటగీతి గారాబంగా.. ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగా' అంటూ చరణాలు రాసుకెళ్లాను. 'అలతి పదాలతో ఎంత కమ్మగా పాట రాశావయ్యా' అని విశ్వనాథ్ మెచ్చుకుంటుంటే నా మేను రోమాంచితమైంది. అది మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి.
* స్ట్రైయిట్ చిత్రాలకు అద్భుతమైన పాటలు రాసిన మీరు డబ్బింగ్ సినిమాలకు ఎక్కువగా పాటలు రాశారు. ఈ రెండింటికీ మధ్య తేడా తెలుపుతారా..?
స్ట్రైయిట్ సినిమాల్లో సన్నివేశానికి, ట్యూనుకు సంబంధించిన పరిమితులు మాత్రమే ఉంటాయి. డబ్బింగు సినిమాల్లో కట్టుబాట్లు ఎక్కువ. పెదవుల కదలికలకు సంబంధించిన ఆంక్షలు. ముఖ్యంగా క్లోజప్ షాట్లు ఉన్నప్పుడు పాట రాయడానికి శ్రమించాలి. ప, ఫ, బ, భ, మ వచ్చిన చోటల్లా పెదాల కదలికతో మనం రాసే పదాలు కలవాలి. అదే మాటల విషయానికొస్తే, ఒక ఫ్లోలో డైలాగులు చెపుతూ ఉంటారు. కనుక రెండు మూడు చోట్ల అటూ ఇటూ లిప్ పోయినా పెద్దగా తెలియదు. కానీ పాట విషయానికొస్తే, పాట ఎప్పుడూ సస్టైన్డ్‌గా ఉంటుంది. ఉదాహరణకు 'క్షత్రియ పుత్రుడు' సినిమాలో 'సన్నజాజి పడకా' తమిళ వర్షన్ పాటలో 'ఇంజి ఈడు ప్పళఘ.. మంజ తవ ప్పళఘ.. కళ్ల నీరి ప్పళఘ.. మరక్క మనం గూడు దిల్లయే' అని ఉంది. ఇక్కడ 'సిరిప్పు + అళఘ' సంధి కలిపితే 'ప్పళఘ' అవుతుంది. ఆ పదం సింక్ అయ్యేలా 'సన్నజాజి పడకా.. మంచెకాడ పడకా.. చల్లగాలి పడకా.. మాట వినకుందీ ఎందుకే' అంటూ మూడు పడకలా అర్థం వచ్చేలా పాట రాశాను. డబ్బింగ్ పాటను లిప్, యాక్షన్, ట్యూన్, సిచువేషన్ రిస్ట్రిక్షన్లను పాటిస్తూ రాయాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఆ పాటలో తెలుగుతనం (నేటివిటీ) కనిపించేలా రాయాలి.
* మీ డబ్బింగ్ పాటలు కొన్ని వివరించండి..
'గజినీ' సినిమాలో 'హృదయం ఎక్కడున్నదీ.. నీ చుట్టూనే తిరుగుతున్నదీ' పాట రెండేళ్ల మారు మోగిపోయింది. ఇందులో 'చుట్టూ విళీ చూడరే' (నిప్పులాంటి చూపు నన్ను కాల్చేస్తోంది అని అర్థం) అనే తమిళ లైన్‌కు నేను 'అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ' అని రాశాను. 'చంద్రముఖి' సినిమాలో ముందు విజువల్ చూడకుండా పాట రాశాను. సంగీత దర్శకుడు విద్యాసాగర్ నాకు మంచి మిత్రుడు. ఆ పాట అతనికి నచ్చింది. 'విజువల్ ఉందా' అని అడిగితే ఇచ్చి చూడమన్నారు. అందులో లాంగ్ షాట్లు ఉండడం వల్ల లిబర్టీ ఉంది కనుక మొదట రాసిన పాట తీసేసి వేరే పాట రాశాను. తమిళ వర్షన్‌లో 'కాలం' అనే మాట ఒకసారే వస్తుంది. కానీ నేను 'కాలం' మీద పూర్తి ప్రయోగం చేశాను. 'కొంత కాలం కొంత కాలం కాలమాగిపోయాలి - నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి.. ఎంత కాలమెంత కాలం హద్దు మీరకుండాలి - అంత కాలమంత కాలం ఈడు నెట్టునాపాలి' అని పల్లవి రాసి చరణాలను కూడా 'కాలం'తో కలిపాను. నేను ఎన్టీఆర్ అభిమానిని. 'భాషా' సినిమాలో అన్నమీద ఉన్న అభిమానాన్ని వాడుకున్నాను. 'నేను ఆటోవాణ్ణి, ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి - న్యాయమైన రేటు వాణ్ణి.. ఎదురులేని ఆటగాణ్ణి' అంటూ 'మంచోళ్లకు మంచివాణ్ణి.. తప్పుడోళ్ల వేటగాణ్ణి.. అచ్చమైన తెలుగువాణ్ణి' అంటూ తెలుగుదనం నింపాను. అది ఎంత హిట్టయిందో మీకు తెలుసు. 'మహానది'లో నేను రాసిన 'శ్రీరంగం రంగనాథుని దివ్య రూపమే చూడరే.. శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడరే - నీలవేణిలో నీటిముత్యాలు.. కృష్ణవేణిలో అలల గీతాలు' పాటను విశ్వనాథ్ టీవీలో చూసి, నాకు ఫోన్ చేసి 'ఈ పాట డబ్బింగ్ పాటలా లేదు. కీప్ ఇట్ అప్' అంటూ అభినందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే యెన్నో మధురానుభూతులు!
* మీరు డబ్బింగ్ పాటలు రాయడానికి గురువెవరు?
ఇంకెవరు 'రాజశ్రీ' మహానుభావుడాయన.
ఇదీ చూడండి:ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత