తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమాటోగ్రఫీ చట్ట సవరణలపై సినీసంఘాల అభ్యంతరం - సినిమాటోగ్రఫీ చట్ట సవరణలు

సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు కేంద్రం సిద్ధమైంది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీలో సవరణలు చేయాలని భావించిన కేంద్రం ఆ దిశగా సన్నాహలు మొదలుపెట్టింది. అవసరమైతే సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పునఃపరిశీలన కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండేలా చట్ట సవరణ చేస్తూ ఇటీవల ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలపాలని 15 రోజులు గడువు విధించింది. ఆ గడువు నిన్నటితో ముగియడం వల్ల ముసాయిదా బిల్లుపై సమీక్షించి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కేంద్ర నిర్ణయం పట్ల యావత్ సినీపరిశ్రమ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటమే నిజమైన చట్టమని పేర్కొంటున్నారు.

Cine communities object to draft amendments to the Cinematography Act
సినిమాటోగ్రఫీ చట్ట సవరణలపై సినీసంఘాల అభ్యంతరం

By

Published : Jul 2, 2021, 9:52 PM IST

భారతీయ సినీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా సినిమాలు ఉంటున్నాయంటూ పౌరసమాజం నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించే పనిలో పడింది. ఈ మేరకు 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును రూపొందించింది. ప్రధానంగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ విషయంపై దృష్టి సారించిన కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ.. 2013లో జస్టిస్ ముఖుల్ ముగ్దల్, 2016లో శ్యామ్ బెనగల్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సవరణల ప్రతిపాదనలపై జులై 2 వరకు అభిప్రాయాలను తెలపాలని కోరుతూ జూన్ 18న ప్రకటన జారీ చేసింది. చట్టంలో సవరించాలని భావిస్తున్న ప్రతిపాదనలు అందులో వివరించింది.

సెన్సార్ బోర్డు జారీ చేసిన ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని ఆ సంస్థ ఛైర్మన్​ను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉండేలా చట్టాలను సవరిస్తామని ప్రతిపాదించింది. అంతేకాకుండా సినిమా ప్రదర్శనలకు జారీ చేసే యు, ఏ, యు/ఏ, ఎస్ సర్టిఫికెట్లతోపాటు యూఏ సర్టిఫికెట్​కు అదనంగా మరిన్ని మార్పులను ప్రతిపాదించింది. యూఏ సర్టిఫికెట్ 1983లో చేసిన సవరణలకు అనుగుణంగా ఉంది. అప్పటి నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల లోపు వారు సినిమా చూసే అవకాశం ఆ సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే దీనికి మార్పులు చేసి 7 ఏళ్లు, 13 ఏళ్లు, 16 ఏళ్లు పైబడిన వారు కూడా చూసేలా.. మూడు విభాగాలుగా విభజించింది.

పైరసీ చేస్తే జైలుకే..

సర్టిఫికేషన్ కాలపరిమితి 10 ఏళ్లు చెల్లుబాటు ఉండగా ఉత్తర్వుల ద్వారా ఆ కాలపరిమితిని రద్దు చేశారు. దానికి అవసరమైన చట్ట సవరణలను చేయనున్నట్లు తెలిపింది. అలాగే పైరసీ వల్ల సినీపరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో సినిమా పైరసీకి అడ్డుకట్ట వేయడానికి ఇప్పటి వరకు సరైన చట్టం లేదని గ్రహించింది. సినిమా పైరసీకి పాల్పడితే కనిష్టంగా 3 నెలలు గరిష్టంగా 3 ఏళ్ల జైలుశిక్షతోపాటు 3 లక్షల జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం డబ్బును జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించింది.

స్టార్​ నటుల అభ్యంతరం..

సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో సినీ ప్రముఖుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అప్పిలేట్ ట్రైబ్యునల్ రద్దు చేశారని, ఇప్పుడు నేరుగా కేంద్రం జోక్యం చేసుకుంటానని చెప్పడం భావప్రకటన స్వేచ్చకు భంగం కలిగించడమేనని కమల్​హాసన్, సూర్య లాంటి నటులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాల్లో ఇదొకటని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ కోసం సినీపరిశ్రమ గళమెత్తాలని పిలుపునిచ్చారు.

కేంద్రం వివరణ..

అయితే కేంద్రం మాత్రం భావప్రకటన స్వేచ్ఛపై తన వాదనను మరోలా వినిపించింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో అధికారాలు ప్రస్తుత చట్టంలో సెక్షన్ 6లోనే ఉన్నాయని పేర్కొంది. 2000 సంవత్సరంలో కర్ణాటక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒకసారి సినిమా సర్టిఫికెట్ జారీ చేశాక ఆ తర్వాత కేంద్రం జోక్యం చేసుకోరాదని తన ఉత్తర్వులు పేర్కొంది. కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అదే సందర్భంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటే దానికి తగిన చట్టాలు ఉండాలని అభిప్రాయపడింది. అలాగే దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీయడంతోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సినిమాలు ఉంటున్నాయంటూ తరచూ కేంద్రానికి ఫిర్యాదులు వస్తున్నాయి. దేశసార్వభౌమత్వం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, అంతర్గత భద్రత విషయంలో భావప్రకటన స్వేచ్ఛకు సహేతుక ఆంక్షలు ఉండొచ్చునని రాజ్యాంగం కూడా స్పష్టం చేస్తోందని కేంద్రం చెబుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

సినిమాటోగ్రఫీ చట్టం-2021 ముసాయిదా బిల్లుపై అభిప్రాయలకు నిన్నటితో గడువు ముగిసింది. ఈ క్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తమ దృష్టికి వచ్చిన అభిప్రాయాలను సమీక్షించి ఈ వర్షాకాల సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్టం-2021ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

ఇదీ చూడండి..రాజమౌళి దర్శకత్వంలో పవర్​స్టార్​?

ABOUT THE AUTHOR

...view details