తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: 'చిత్రలహరి' ఎలా ఉందంటే..! - సాయిధరమ్ తేజ్

ఎన్నో అంచనాల మధ్య నేడు విడుదలైన సినిమా 'చిత్రలహరి'. హీరోహీరోయిన్లుగా సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే...

రివ్యూ: 'చిత్రలహరి' ఎలా ఉందంటే..!

By

Published : Apr 12, 2019, 3:44 PM IST

మెగా మేనల్లుడిగా టాలీవుడ్​లోకి అడుగుపెట్టాడు సాయిధరమ్ తేజ్. కెరీర్ మొదట్లో విజయాలు అందుకున్నా తర్వాత వరుసగా పరాజయాలు చవిచూశాడు. సాయితేజ్​గా పేరు మార్చకుని.. "నేను శైలజ" దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటించాడు. వీరిద్దరూ ఓ "ప్లేట్ సక్సెస్" కోసం చేసిన ప్రయత్నమే "చిత్రలహరి". ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర అలరించిందో చిత్ర సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఇదీ కథ:

పేరులో ఉన్న విజయం తనకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే యువకుడు విజయ్(సాయితేజ్). చిన్నప్పటి నుంచే ఎలక్ట్రానిక్ పరికరాలతో రకరకాల ప్రయోగాలు చేయడం అభిరుచిగా మలుచుకున్న హీరోను... పాఠశాల స్థాయి నుంచే పరాజయాలు పలకరిస్తుంటాయి. రోడ్డు ప్రమాదాల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న వాహనదారులను రక్షించేందుకు "యాక్సిడెంట్ అలర్ట్ డివైజ్" ను తయారు చేస్తాడు. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వివిధ కంపెనీల చుట్టూ తిరుగుతాడు. కానీ దాన్ని ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా, విజయ్​ను పనికిరానివాడుగా అందరూ భావిస్తుంటారు. చివరకు ఆ ప్రాజెక్టును విజయ్ ఎలా సక్సెస్ చేసి చూపించాడు, తన జీవితంలోకి విజయాన్ని ఎలా ఆహ్వానించాడనేదే "చిత్రలహరి" కథ.

ఎలా ఉందంటే....

సినిమా టైటిల్స్ లోనే సినిమా లైన్ ఏంటో చెప్పిన దర్శకుడు కిశోర్ తిరుమల... వరుస పరాజయాలతో ఉన్న మెగా హీరోకు గట్టి హిట్ ఇద్దామనే ప్రయత్నించాడు. కానీ తన కథనంతా ఓ పరికరం చుట్టూ అల్లుకున్నాడు దర్శకుడు. జీవితంలో సక్సెస్ అందుకోవాలనే తపన ఓ వైపు, ప్రేమించిన అమ్మాయి దూరమైందనే బాధ మరోవైపు... ఇలాంటి పాత్రలో సాయితేజ్​ను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుడికి సాదాసీదాగా అనిపిస్తుంది.

కానీ దర్శకుడు కిశోర్ ఎంచుకున్న యాక్సిడెంట్ అలర్డ్ డివైజ్ ప్రాజెక్టు గొప్ప విషయం. ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులను ప్రోత్సహించేవారు లేక విజయానికి, పరాజయానికి మధ్యలో నలిగిపోతున్న యువతరాన్ని ఈ కథ ఆలోచింపజేస్తుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రయత్నమే విజయమనే సత్యాన్ని చాటుతుంది.

తొలిసగం సాయితేజ్, కల్యాణి ప్రియదర్శినిల లవ్ ట్రాక్, నివేదా పేతురాజ్ పాత్ర ప్రవర్తించే తీరు, సునీల్ కామెడీ అలరిస్తుంది. ప్రాజెక్టును సక్సెస్ చేసుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, చివరకు అతడ్ని అందరూ గుర్తించడం లాంటి అంశాలతో కథ ముగుస్తుంది.

ఎవరెలా చేశారు

ప్రతి ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నానని చెప్పే మెగా హీరో సాయి తేజ్... నిజ జీవితంలో సక్సెస్ కోసం పడే తపన ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. అతడికి జోడీగా కల్యాణి ప్రియదర్శిని, ప్రాజెక్టు మేనేజర్ గా నివేదా పేతురాజ్ పరిధి మేరకు నటించారు. సునీల్, వెన్నెల కిశోర్ నవ్వించారు. పోసాని కృష్ణమురళి పాత్ర... కొడుకు సక్సెస్ కోసం చెప్పే మాటలు స్ఫూర్తి కలిగిస్తాయి.

దేవీ శ్రీప్రసాద్ సమకూర్చిన బాణీలు బాగున్నాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే 'ప్రయత్నమే విజయం..' పాట చంద్రబోస్ కలం బలాన్ని మరోసారి చాటుతుంది.

ఆదివారం పూట సక్సెస్ ను రమ్మనడం, చీకటికి చిరునామా, దాహం వేస్తే కన్నీళ్లతో గొంతు తడుపుకోలేం, ప్రేమికులు అభిమన్యుడిల్లాంటోళ్లు, సక్సెస్ అంటే స్విగ్గీలో ఇచ్చే ఆర్డర్ కాదు లాంటి పలు సంభాషణలు దర్శకుడు కిశోర్ రచనకు అద్దంపడతాయి.

చివరిగా: ‘చిత్రలహరి’... కొంచెం వినోదం.. కొంచెం సందేశం..

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ABOUT THE AUTHOR

...view details