చిత్రసీమను రెండు మెగా సీజన్లు వెంట వెంటనే పలకరించబోతున్నాయి. వీటిలో ఒకటి క్రిస్మస్ , మరొకటి సంక్రాంతి. అయితే ఈ రెండు పండగల్లోనూ సందడంతా పోలీసులు, మేజర్లదే. క్రిస్మస్ బరిలో ఇద్దరు పోలీసు అధికారులు పోటీ పడుతున్నారు. ముగ్గుల పండక్కి ఓ పోలీస్ అధికారి, మరో మేజర్ తుపాకులు ఎత్తబోతున్నారు.
చుల్‌బుల్ పాండేతో పోటీకి ఇన్స్పెక్టర్ ధర్మ
డిసెంబరు 20న బాలకృష్ణ 'రూలర్'గా తుపాకీ తీయబోతున్నారు. అదే రోజు చుల్‌బుల్ పాండేగా రాబోతున్నాడు సల్మాన్. 'దబాంగ్ 3'తో బాక్సాఫీస్ బరిలో దిగనున్నాడు. బాలయ్య.. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం.. కండల వీరుడు మాత్రం అన్ని ప్రాంతీయ భాషలపై దృష్టిపెట్టాడు.
'దబాంగ్-3'ను హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయబోతున్నాడు. మిగతా ప్రాంతాల్లో సల్మాన్‌కు పోటీ పెద్దగా ఉండనప్పటికీ తెలుగులో మాత్రం బాలయ్య క్రేజ్‌ను దాటి ఎలా సత్తా చాటుతాడో చూడాలి.