Choreographer Shivashankar master died: ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ గచ్చిబౌలి ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారాయన. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం కరోనా బారినపడింది. ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ ఇంకా కోలుకోలేదు.
1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు శివశంకర్ మాస్టర్. 10 భాషల్లోని 800 చిత్రాలకుపైగా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. దాదాపు 30 చిత్రాల్లో నటించారు. పలు భాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు. 'మగధీర' చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు.
1975లో 'పాట్టు భరతమమ్' చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 'కురువికూడు' చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. 'అమ్మోరు', 'సూర్యవంశం', 'అల్లరి పిడుగు', 'అరుంధతి', 'మహాత్మా', 'బాహుబలి 1' చిత్రాలకు కొరియో గ్రాఫర్ పనిచేశారు. కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెరపైనా తనదైన ముద్రవేశారు. 2003లో వచ్చి 'ఆలయ్' చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్ మాస్టర్ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. బుల్లితెర పైనా తనదైన ముద్రవేశారు. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు ప్రస్తుతం టాప్ నృత్య దర్శకులుగా కొనసాగుతున్నారు. శివ శంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్ శివ శంకర్, అజయ్ శివ శంకర్ ఇద్దరూ డ్యాన్స్ మాస్టర్లే.