'హనీ ఈజ్ ద బెస్ట్' అంటూ 'ఎఫ్2' చిత్రంలో సందడి చేసి ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది నటి మెహ్రీన్ పీర్‌జాదా. అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చానని చెప్పే ఈ పంజాబీ భామ.. ప్రసుత్తం 'ఎఫ్3'లోనూ సందడి చేయనుంది. ఈ సందర్భంగా తన ఇష్టాయిష్టాల గురించి వివరిస్తోందిలా..
సినిమా ఆలోచన లేదు
మాది పంజాబ్. మా కుటుంబంలో ఓ ఐఏఎస్ అధికారి ఉండేవారు. దాంతో నాన్నకు నన్ను ఐఏఎస్ చేయాలని ఉండేది కానీ నాకు మాత్రం ఓ లక్ష్యం అంటూ ఉండేది కాదు. ఇంజినీర్, డాక్టర్, ఆర్కిటెక్ట్.. ఇలా ఎవరిని కలిసినా వారిలా అవ్వాలనుకునేదాన్ని. అంతెందుకు ఓసారి దలైలామా గురించి తెలిసి ఆయనలా నేనూ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించా. అంతేతప్ప సినిమా రంగంవైపు మాత్రం రావాలనుకోలేదు.
మొదటి అవకాశం ఎలాగంటే..
నాకు పదేళ్లున్నప్పుడు ఓ ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్నా. కొన్నాళ్లకు కెనడాలో ఓ అందాల పోటీలో పాల్గొని 'మిస్ పర్సనాలిటీ'గా గుర్తింపు తెచ్చుకున్నా. తర్వాత అడపాదడపా ప్రకటనలు చేయడం వల్ల సినిమా రంగంలోకి రావాలని పించింది. అలాంటి సమయంలో 'సరైనోడు' ఆడిషన్‌కు వచ్చా కానీ కొన్నికారణాల వల్ల ఆ సినిమా చేయలేదు. చాలా తక్కువ సమయంలోనే మళ్లీ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'లో ఛాన్స్ వచ్చింది. తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే.. సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు అమ్మ ప్రోత్సహించింది కానీ నాన్న నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు మాత్రం నాన్న 'ఏ సినిమా చేస్తున్నావు.. షూటింగ్ ఎక్కడ ఉంది..' అంటూ అడుగుతుంటారు.
ఆ డాక్టర్ అంటే ఇష్టం
చిన్నప్పుడు ఎవరికైనా సినిమా హీరో లేదా తెలిసిన అబ్బాయిపైన క్రష్ ఉంటుంది కానీ నేను మాత్రం మా ఫ్యామిలీ డాక్టర్‌ను ఇష్టపడేదాన్ని. ఆయన చాలా అందంగా ఉండేవారు. ఆ డాక్టర్‌ను ఎప్పుడు కలిసినా 'అంకుల్ నాకు మీరంటే ఇష్టం' అని చెప్పేదాన్ని. అలా ఎన్నిసార్లు చెప్పి ఉంటానో కూడా గుర్తులేదు. అప్పుడప్పుడూ అమ్మతో.. 'ఒక్కసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి హాయ్ చెప్పేసి వద్దామా' అని అడిగేదాన్ని కూడా.
నచ్చే నటుడు
సల్మాన్‌ఖాన్. అతను వయసులో నాకన్నా చాలా పెద్దవాడని తెలిసిన రోజు ఎంత బాధపడ్డానో నాకు ఇప్పటికీ గుర్తే. సినిమాల్లోకి వచ్చాక తనను కలిసి మాట్లాడాననుకోండి.