దాదాపు పదేళ్ల విరామం అనంతరం తనలోని నటుడ్ని బయటపెట్టారు చిరంజీవి. కొన్నాళ్లు రాజకీయాల్లో పనిచేసిన ఈయన 'ఖైదీ నంబర్ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమాతో మరోసారి రుజువు చేశారు. డైలాగ్స్, డ్యాన్సులతో దుమ్ములేపి అభిమానుల్లో నూతనోత్తేజం నింపారు. తాము కోరుకున్నవన్నీ చిరు ఈ సినిమాతో అందించారని అభిమాన వర్గం పండగ చేసుకున్నారు. మరి చిరు 'సైరా నరసింహారెడ్డి'తో రీ ఎంట్రీ ఇచ్చి ఉండుంటే? ఇదే సందేహం కలిగింది చిరుకి. ఎందుకో తెలియాలంటే ఇది చదివేయండి.
"నా సినీ జీవితంలో చెప్పుకోదగ్గ పాత్రలు ఓ పది ఉంటాయి. అవన్నీ ఆయాసీజన్‌లో హిట్ అయ్యాయి, నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఉంది. ఎన్టీఆర్ అంటే పౌరాణిక పాత్రలు గుర్తొస్తాయి. నాకు ఖైదీ, ఇంద్ర, చూడాలని ఉంది, స్టాలిన్ వంటి హిట్లు ఉన్నాయి. కానీ.. చరిత్రలో నిలిచిపోయే పాత్రలేదు అనే అసంతృప్తి ఉండేది. నాకు వ్యక్తిగతంగా స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలని ఉండేది. భగత్‌సింగ్ కథ చేయాలనుకున్నా. ఏ నిర్మాత గానీ, కథకుడు గానీ ఆ కథతో నా ముందుకు రాలేదు. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ గురించి తెలిసింది. దీన్ని కమర్షియల్ కథగా కూడా చేయొచ్చని పరుచూరి బ్రదర్స్ నాకు చెప్పారు. నాకు కథ నచ్చింది. కానీ దర్శకత్వం వహించేవారు, అంత భారీ బడ్జెట్‌ను పెట్టేవారు ముందుకు రాలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లా. విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చా. నా 150వ సినిమా ఎలాంటి కథతో తీస్తే బాగుంటుందని చాలా ఆలోచించాం. 'సైరా' కథ కూడా అందులో ఉంది. అయితే, నా రీఎంట్రీలోనే ఈ పాత్ర చేస్తే వైవిధ్యమైన పాత్రలే చేయాల్సి వస్తుందనే మీమాంస ఉంది. అందుకే పదేళ్ల కిందట నన్ను చూసి ప్రేక్షకులు ఏవిధంగా ఆనందపడ్డారో అలాగే రీఎంట్రీ ఇవ్వాలనుకున్నా. అందుకే రీమేక్ కథను ఎంచుకున్నా. అందులోనూ సందేశం ఉండటం వల్ల మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. ఖైదీ నంబర్ 150 తర్వాత నా క్రేజ్ అలానే ఉందని అర్థమైంది. ఈ తరుణంలో చరిత్రలో కనుమరుగు అవుతున్న వీరుడి సినిమాను బయటికి తీసుకురావాలి అనుకున్నాం. దాన్ని తెరపైకి తీసుకురావాలి.. పాన్ ఇండియాగా రూపొందించాలనుకున్నాం. కానీ, బడ్జెట్ చూసుకుంటే రూ.300 కోట్లు కనిపిస్తోంది. అంత బడ్జెట్ పెట్టి తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని, బలాన్ని, ధైర్యాన్ని బాహుబలి రూపంలో రాజమౌళి మాకు ఇచ్చారు. ఆయనకు థ్యాంక్యూ. మనమే బడ్జెట్ పెట్టి తీద్దామని చరణ్ అన్నాడు. అలా సినిమా తెరపైకి వచ్చింది" అని చిరు ఓ సందర్భంలో చెప్పారు.