పెద్దరికం అనే హోదా తనకు ససేమిరా ఇష్టం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పెద్దగా ఉండను కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి 50 శాతం రాయితీతో హెల్త్ కార్డుల పంపిణీ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరు.. కళామతల్లికి తోబుట్టువులుగా భావించి తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ కార్మికులు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌ల్లో పాల్గొనాలని సూచించారు.
"పెద్దరికం అనే హోదా నాకు ససేమిరా ఇష్టం లేదు. పెద్దగా ఉండను కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు నేనున్నానంటూ ముందుకొస్తాను. అనవసరమైనవాటికి తగుదునమ్మా అంటూ ముందుకొచ్చే ప్రసక్తే లేదు. అవసరమైనప్పుడు నా భుజం కాయలనుకున్నప్పుడు వస్తాను. ఇద్దరు కొట్టుకుంటే తగువు తీర్చమంటే తీర్చను. ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటాను" అని చిరంజీవి చెప్పారు.