తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పునాది రాళ్లు నుంచి సైరా వరకు తగ్గని 'మెగా' జోరు - #SYRRA

నర్తిస్తే.. నటరాజు సైతం మెచ్చుకుంటాడు. నటిస్తే.. ప్రతి తెలుగు వాడు పొంగిపోతాడు. కనిపిస్తే.. ప్రతి అభిమాని ఆరాధిస్తాడు. ఇలా ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. నేటితో 64 ఏళ్లు పూర్తి చేసుకుని 65వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆయన జీవితంపై ఓ లుక్కేద్దాం!

ఇప్పటికీ తగ్గని జోరు.. ఆయనే మెగాస్టార్ చిరు

By

Published : Aug 22, 2019, 5:11 AM IST

Updated : Sep 27, 2019, 8:25 PM IST

"రజినీకాంత్​లా స్టైల్​గా ఫైట్స్​ చేయగలరు... కమల్ హాసన్​లా విభిన్నంగా నటించగలరు... అమితాబ్​లా హాస్యం పండించగలరు"... స్వయానా రజినీయే ఈ మాటలతో మెగాస్టార్​ను ప్రశంసించారు. ఇలా అందరి హీరోల ప్రత్యేకతలను తనలో దాచుకుని ఆల్​రౌండర్ అనిపించుకున్నారు చిరు. మారుమూల పల్లె నుంచి వచ్చి ఆల్​ఇండియా స్టార్​గా ఎదిగిన మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు నేడు.

ఇటీవలి ఫొటోషూట్​లో చిరంజీవి లుక్స్​

నేపథ్యం

1955 ఆగస్టు 22న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు చిరంజీవి. చెన్నైలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిప్లొమా పొందిన చిరు.. 1978లో ‘పునాదిరాళ్లు’ చిత్రంతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించారు.

'ప్రాణం ఖరీదు'తో ప్రేక్షకులకు పరిచయం..

'పునాదిరాళ్లు'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. 'ప్రాణం ఖరీదు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. 'ప్రాణం ఖరీదు' 1978 సెప్టెంబరులో విడుదలైంది. 'పునాది రాళ్లు' 1979 జూన్ 21న వచ్చింది.

'చిరంజీవికి' ఆ పేరు ఎలా వచ్చింది..?

చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అయితే 'పునాదిరాళ్లు' తీసే సమయంలో స్క్రీన్​ నేమ్​ను చిరంజీవిగా మార్చుకున్నారు. కలలో ఎవరో చిరంజీవి అని పిలిచినట్టు.. దేవుని ఆశీస్సులతో తనకు పేరు లభించినట్టు చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారుచిరు.

పునాదిరాళ్లు చిత్రంలో చిరు

పాత, కొత్త తరానికి వారధి..

అప్పటికి బ్లాక్ అండ్ వైట్​లోనే సినిమాలు తీసేవారు దర్శకులు. ఎన్టీఆర్​, ఏఎన్నార్, కృష్ణ, శోభన్​బాబు ఇలా ముందు తరం నటులతో పనిచేశారు మెగాస్టార్. ఈ విధంగా పాత, కొత్త సినిమాలకు వారధిలా మారానని ఆయన ఓ సందర్భంలో అన్నారు.

ప్రేక్షకుల అభిరుచి తెలిసిన హీరో..

అప్పటివరకు సినిమాల్లో పాటలొచ్చే సమయంలో ప్రేక్షకులు విసుగ్గా కనిపించే వారు. హీరోల ఫైట్స్​ సన్నివేశాలను డూప్స్​తో చేయించేవారు. పోరాటాలు మహిళలకు పెద్దగా నచ్చేవి కావు. ఈ రెండు మాస్​ అంశాలను ప్రేక్షకులకు నచ్చేలా ప్రయత్నం చేసిన హీరో చిరంజీవి. కాలానుగుణంగా తగిన పాత్రలు చేస్తూ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్​గా ఎదిగారు.

"ప్రేక్షకుడికి, అభిమానికి ఏం కావాలో అది ఇచ్చేందుకు నేను కష్టపడతాను. దాన్నే ఇష్టపడతాను. విభిన్న పాత్రలు పోషించడం అన్ని రకాల, రంగాల వారికి మంచి వినోదాన్ని అందించేందుకే నా కృషంతా. తొలి నుంచి సహజమైన భావోద్వేగాల్ని చూపించాలన్న తపన ఉంది. అందుకే విభిన్నమైన పాత్రలు చేశాను" -చిరంజీవి

మైలురాళ్ల లాంటి చిత్రాలు..

పునాదిరాళ్లుతో సినీ కెరీర్​ ప్రారంభించిన మెగాస్టార్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఖైదీ, స్వయంకృషి, వేట, అడవి దొంగ, రుద్రవీణ, చంటబ్బాయి, కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆపద్భాందవుడు, హిట్లర్, స్నేహం కోసం లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు.

స్వయంకృషిలో మెగాస్టార్

చూడాలని ఉంది, బావగారూ బాగున్నారా, ఇంద్ర, ఠాగూర్, జై చిరంజీవ, స్టాలిన్, శంకర్ దాదా ​ చిత్రాలతో మాస్​లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి.. సినిమాలకు విరామం ఇచ్చారు. అనంతరం 2017లో ఖైదీ నెంబర్ 150తో 'బాస్​ ఈజ్ బ్యాక్' అంటూ రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు. త్వరలో 'సైరా నరసింహారెడ్డి'తో మనముందుకు రాబోతున్నారు.

అవార్డులకు కేరాఫ్​..

చిరంజీవి నటనకు అవార్డులు వరుస కట్టాయి. సినీ పరిశ్రమలో చిరు ప్రస్థానానికి మెచ్చి భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్​తో గౌరవించింది. తొమ్మిది ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలు.. నాలుగు నంది అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి.

ఇది చదవండి: చిరంజీవిని కలిసిన పవన్.. అభిమానుల్లో ఆసక్తి

Last Updated : Sep 27, 2019, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details