కొణిదెల శివ శంకర వరప్రసాద్ మధ్యతరగతి యువకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపుర్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నటుడు అవుదామనే కోరికతో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1976లో చేరాడు. ఆ రంగుల ప్రపంచంలో అందరిలానే కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, వాటినే తన విజయ సోపానాలుగా మార్చుకున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, తన చుట్టూ ఉండే వాళ్లను ఆశ్చర్యపరుస్తూ మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. ఇప్పుడు ఇలా మన ముందున్నారు. ఆయన 67వ పుట్టినరోజు సందర్భంగా 'ఈటీవీ భారత్' అందిస్తున్న ప్రత్యేక కథనం.
డ్యాన్స్‌కు కేరాఫ్
టాలీవుడ్ డ్యాన్స్‌కు పర్యాయపదం చిరు. ఫోక్, బ్రేక్, క్లాసికల్, డిస్కో.. ఇలా ఒకటేమిటి ఎందులో అయినా సరే తన మార్క్ సృష్టించి, అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ఇప్పటికీ ఎంతోమందికి అభిమాన కథానాయకుడిగా కొనసాగుతున్నారు.
చిరు సినిమాతోనే రూ.10 కోట్లు కలెక్షన్
చిరంజీవి 'ఘరానా మొగుడు'(1992).. రూ.10 కోట్ల కలెక్షన్ సాధించిన తొలి తెలుగు సినిమా. తర్వాతి ఏడాది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. 1986లో కన్నడలో వచ్చిన 'అనురాగ అరలితు'కు ఇది రీమేక్. నగ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
ఆస్కార్‌కు ఆహ్వానం
లాస్ ఏంజెల్స్‌లో 1987లో జరిగిన 59వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి చిరును ఆహ్వానించారు. దీంతో దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు.
రెమ్యునరేషన్లో టాప్
'ఇంద్ర'(2001) సినిమా కోసం రూ.7 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న మెగాస్టార్.. అప్పట్లో 'లగాన్' కోసం రూ.6 కోట్లు అందుకున్న ఆమిర్‌ను అధిగమించారు.
రష్యన్లో చిరు 'స్వయంకృషి'
చిరు నటించిన ప్రయోగాత్మక చిత్రం 'స్వయంకృషి'. ఇందులో ఆయన చెప్పులు కుట్టేవాడి పాత్రలో నటించారు. దిగ్గజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. రష్యన్ డబ్ చేయడమే కాకుండా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేక ప్రదర్శన కూడా వేశారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ 'స్వయంకృషి'ని ప్రదర్శించడం విశేషం.