వెండితెరపై చిరంజీవి, విజయశాంతి జోడీకి మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో ఇప్పటివరకు 15కు పైగా చిత్రాలు రాగా మూడు నాలుగు చిత్రాలు మినహా మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాల్ని అందుకున్నాయి. ఇక వీళ్లిద్దరూ ఆఖరిగా 1993లో వచ్చిన 'మెకానిక్ అల్లుడు' చిత్రంలో నటించాక మళ్లీ తెరపై ఒకటిగా సందడి చేసింది లేదు. కానీ, ఇప్పుడు దాదాపు 27ఏళ్ల తర్వాత ఈ ఇద్దరినీ తెరపై దర్శించుకునే అవకాశం రాబోతుందని సమాచారం.
27ఏళ్ల తర్వాత.. చిరుతో విజయశాంతి! - విజయశాంతి తాజా వార్తలు
ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక 'లూసిఫర్' రీమేక్ పట్టాలెక్కించనున్నారు. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి ఓ కీలకపాత్ర చేయబోతుందని సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రం రూపొందుతోంది. ఇది పూర్తయిన వెంటనే ఆయన 'లూసిఫర్' రీమేక్‌లో నటించడం ఇప్పటికే ఖాయమైంది. యువ దర్శకుడు సుజిత్ దీన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే స్క్రిప్టు పనులు ప్రారంభమైపోయాయి. ఇప్పుడీ చిత్రంలోనే విజయశాంతికి ఓ కీలక పాత్ర ఉందని తెలుస్తోంది.
నిజానికి ఈ పాత్రపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. జెనీలియా, టబు, త్రిష తదితరుల పేర్లు ఈ పాత్రకు పరిశీలిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, తాజాగా చిత్ర వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం దీన్ని విజయశాంతి కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతోన్నట్లు తెలుస్తోంది. మరి దీంట్లో వాస్తవమెంత? అసలా పాత్ర ఏంటి? ఎలా ఉండబోతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.