ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియదు. కరోనా కల్లోలం ప్రభావం ఫలితమే ఇదంతా. తొలి కాపీతో సిద్ధమైన సినిమాలు కూడా వేచి చూడాల్సి వస్తోంది. ఇక సెట్స్‌పై ఉన్న సినిమాల సంగతి సరే సరి. వాటి చిత్రీకరణ సజావుగా సాగాలి, విజయవంతంగా పూర్తి కావాలి, విడుదల కోసం థియేటర్ల దగ్గర తగిన ఖాళీ దొరకాలి. అప్పుడు కానీ బొమ్మ తెరపై పడే అవకాశం ఉండదు. అయినా సరే.. సినీ వర్గాలు మాత్రం ఎప్పట్లాగే విడుదల కోసం కట్చీప్‌లు వేయడం మొదలు పెట్టేశాయి. అధిక వ్యయంతో తెరకెక్కిన తారల సినిమాలన్నీ పండగల్ని చూసుకుని తేదీల్ని ప్రకటించాయి. పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలేమో.. ఇదే అదను అన్నట్టుగా వారం వారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మరికొన్ని ఓటీటీ వేదికల్ని ఎంచుకున్నాయి. మొత్తంగా రెండో దశ కరోనా తర్వాత మళ్లీ విడుదల తేదీలపై ఓ స్పష్టతైతే వచ్చింది. మరి అనుకున్నట్టు విడుదలవుతాయా లేదా అనే సంగతిని మాత్రం కాలమే నిర్ణయించాలి. అయితే ఇంకా కొన్ని కీలకమైన సినిమాలు ఇప్పటికీ విడుదల తేదీల్ని ప్రకటించలేదు. మరి వాటి పయనం ఎటు? ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తాయి?
వాటికి ముహుర్తం ఎప్పుడు?
దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. టాలీవుడ్ ఈ బెర్తులన్నిటినీ ఎప్పుడో నింపేసింది. దసరాకి 'ఆర్‌ఆర్‌ఆర్', దీపావళికి 'గని', 'అన్నాత్తే', క్రిస్మస్‌కి 'పుష్ప', 'కె.జి.ఎఫ్2', సంక్రాంతికేమో పవన్‌కల్యాణ్- రానా 'భీమ్లా నాయక్', మహేష్‌బాబు 'సర్కారు వారి పాట', ప్రభాస్ 'రాధేశ్యామ్'. ఇలా వచ్చే ఏడాదివరకు బాక్సాఫీసుకి విరామమే కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనేమో అగ్ర తారల సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. టికెట్ ధరల సమస్య కొలిక్కి రాలేదు. అందుకే ఈ రెండు నెలల్ని చిన్న సినిమాలకే వదిలేసింది చిత్రసీమ. సెప్టెంబరులో పలు సినిమాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. కానీ తుదిదశకు చేరుకున్న 'ఆచార్య', 'అఖండ', ఇప్పటికే పూర్తయిన 'లవ్‌స్టోరి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాల విడుదల ఎప్పుడనేదే ఇంకా ఖరారు కాలేదు.
దసరానే లక్ష్యమా?