మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (MAA Elections 2021) పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఉదయం 9గంటల సమయానికే దాదాపు 30శాతం మంది 'మా' సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. .సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మోహన్‌బాబు ఉదయమే పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు రామ్‌చరణ్ సైతం ఓటేశారు. ఆయనతో పాటు సుమ, శ్రీకాంత్, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, ఉత్తేజ్, శివబాలాజీ, సుడిగాలి సుధీర్, రాఘవ తదితరులు ఓటు వేసిన వాళ్లలో ఉన్నారు.
ఇలా జరగకుండా చూస్తాం: చిరంజీవి
ఓటేసిన అనంతరం మాట్లాడిన అగ్ర కథానాయకుడు చిరంజీవి.. ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. దురదృష్టవశాత్తు మా ఎన్నికల్లో పోటీ వాతావరణం నెలకొందని అన్నారు. ప్రతిసారీ ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎన్నికలు జరగడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మాట్లాడుతున్న చిరంజీవి, పవన్ కల్యాణ్ "ఎల్లవేళలా పరిస్థితులు ఒకేలా ఉండవు. పరిస్థితులకనుగుణంగా సమాయత్తం కావాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. కళాకారులు ఎన్నుకున్న ప్యానెల్‌కే నా మద్దతు. వ్యక్తిగతంగా ఎవరినీ ప్రభావితం చేయదల్చుకోలేదు. కళాకారులు కోరుకున్నదే అందరికీ శిరోధార్యం. ప్రస్తుత 'మా' ఎన్నికలను ప్రత్యేక సందర్భంగా చూడాలి. దురదృష్టవశాత్తు ఈ ఎన్నికల్లో పోటీ వాతావరణం నెలకొంది. ప్రతిసారి ఎన్నికలు ఇలాగే జరుగుతాయని భావించట్లేదు. ప్రతిసారి ఎన్నికలు ఈవిధంగా జరగడం మంచిదికాదు. భవిష్యత్తులో ఇలా జరగకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం."
-చిరంజీవి, నటుడు
'మా' ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని, అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నట్లు తెలిపారు చిరంజీవి. కొందరు షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చని, దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడనని తెలిపారు.
మరోవైపు, ఈ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలను ఇప్పటివరకు తాను చూడలేదని అగ్రనటుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను ఎవరికి మద్దతుగా నిలిచానో చెప్పడం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని అన్నారు. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని, రాజకీయాలపై 'మా' ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవని పునరుద్ఘాటించారు.
"సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సినిమాలు చేసే వాళ్లు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యక్తుల వ్యాఖ్యలతో సినీ రంగానికి సంబంధం ఉండదు. 'మా' ఎన్నికలు సున్నితంగా, ఏకగ్రీవంగా జరగాల్సింది. చాలాసార్లు ఓటేసినా.. ఈ స్థాయి ఎన్నికలు చూడలేదు."
-పవన్ కల్యాణ్, నటుడు
కాగా, 'మా' పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడం వల్ల.. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అక్కడి నుంచి పంపించేశారు.
మధ్యాహ్నం వరకు ఓటింగ్..
'మా'లో మొత్తం 925మంది సభ్యులు ఉండగా, 883మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. సుమారు 500మందికిపైగా 'మా' సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్ జరగనుండగా, సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మొదట ఈసీ మెంబర్ల ఫలితాలు, చివరికి 'మా' అధ్యక్షుడి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాత్రి 8గంటల తర్వాత 'మా' అధ్యక్షుడి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ కో-ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో పోలింగ్‌ను నిర్వహిస్త్తున్నారు. 'మా' ఎన్నికలకు 50మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.