charan tarak friendship: 'నేనూ.. చరణ్ ప్రపంచానికి తెలియకుండా చాలా నిశ్శబ్దంగా, సంతోషంగా స్నేహితులుగా ఉండేవాళ్లం. దర్శకుడు రాజమౌళి వల్లే మా ఇద్దరి మధ్య స్నేహం బయటపడింది. మా స్నేహం వ్యక్తులుగా మరింత ఉన్నతంగా మెలగడానికి దోహదం చేసింది' అని అన్నారు ప్రముఖ కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్. ఆ ఇద్దరూ నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు రాజమౌళితో కలిసి ఎన్టీఆర్, రామ్‌చరణ్ దుబాయ్ ఎక్స్‌పోలో సందడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పలు విషయాల్ని వెల్లడించారు. 'పని రాక్షసుడైన రాజమౌళితో పని చేయడాన్ని ఆస్వాదిస్తుంటా. ఒత్తిడిలో పనిచేసినప్పుడు కొన్ని ప్రయోజనాలు కలుగుతుంటాయ'ని రామ్ చరణ్ అన్నారు. 'రాజమౌళితో చనువు నాకు మేలే చేసింది. నటుడిగా నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు' అన్నారు ఎన్టీఆర్.
రాజమౌళి మాట్లాడుతూ 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి చేయాల్సిన కొన్ని సన్నివేశాల్ని, మనదైన సాంకేతికతతో పరిమిత వ్యయంతోనే రూపొందించాం. సంప్రదాయబద్ధంగా మనం ఎక్కువ మందిని వినియోగిస్తామేమో కానీ...హాలీవుడ్ ఎక్కువ ఖర్చుతో తీసే సన్నివేశాల్ని మనం తక్కువ ఖర్చుతో, కొత్త ఆవిష్కరణలతోనే తీస్తుంటాం. 'ఆర్‌ఆర్‌ఆర్'లో జంతువులకి సంబంధించిన సన్నివేశాల్ని మనదైన సాంకేతికతతో పరిమిత వ్యయంతోనే తెరకెక్కించాం' అన్నారు.