సెలబ్రిటీల పెళ్లి అంటే కెమెరాలన్నీ అటువైపే ఉంటాయి. వారు ఎవరిని వివాహం చేసుకోబోతున్నారు? వేడుక ఎక్కడ జరగనుంది? ఎవరెవరు హాజరవుతున్నారు? వంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే మరింత ఉత్సాహం వస్తుంది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి నటాషా దలాల్‌ను గోవాలో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బీచ్ సిటీస్‌లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సెలబ్రిటీ జంటలెవరో చూద్దాం.
వరుణ్ ధావన్-నటాషా దలాల్
హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ వివాహం.. ప్రస్తుతం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. జనవరి 24(ఆదివారం)న ముంబయిలోని అలీబాగ్ రిసార్ట్స్‌లో వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఈ పట్టణం బీచ్‌లకు చాలా ఫేమస్. సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
చైసామ్
పర్యాటకుల స్వర్గధామమైన గోవాలో నాగచైతన్య-సమంతల వివాహం జరిగింది. గోవాలోని స్టార్ హోటల్ 'డబ్ల్యు'లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీరి వివాహ వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిపారు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వేడుక పూర్తి చేశారు.