'ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న' మదర్ థెరిస్సా చెప్పిన ఈ మాటలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం. కోట్లు కూడబెడితే వచ్చే సంతోషంతో పోలిస్తే, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే వచ్చే ఆనందమే వేరు. చరిత్రలో పీడకలను మిగిల్చిన సంవత్సరం 2020. కరోనా ప్రభావం ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపైనా పడింది. భారతదేశంలో లాక్‌డౌన్ విధించడం వల్ల లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన ఎంతో మంది పేదలను మానవతా హృదయంతో ఆదరించిన వారెందరో. ఇందుకు సినీ తారలు కూడా తమ వంతు సాయం చేశారు. సినిమాలతో సందడి చేయడమే కాదు, ఆపదలో ఆదుకుంటామంటూ ముందుకు వచ్చారు. అలా ఈ ఏడాది తమ వంతు సాయం చేసిన సినీతారల గురించి తెలుసుకుందాం!
వెండితెర విలన్.. రియల్ హీరో
కరోనా కారణంగా ఇబ్బందులు పడిన వారికి చాలా మంది చాలా రకాలుగా సాయం చేశారు. కానీ, నటుడు సోనూసూద్ ఈ విషయంలో ఎవరికీ అందనంత స్థాయికి వెళ్లిపోయారు. పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. కనీసం సొంత ఊళ్లకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల కాలే కడుపుతోనే రోజులు వెళ్లదీయాల్సిన పరిస్థితిని ఎంతోమంది ఎదుర్కొన్నారు. అలాంటి వారిని ప్రత్యేక బస్సుల్లో సొంతూళ్లకు తరలించడం ద్వారా సాయం చేయటం మొదలు పెట్టిన సోనూ సూద్ ఒక రకంగా 'దాన కర్ణుడిని' మించిపోయారు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ వెళ్లారు. వలస కార్మికుల కోసం, బస్సులు, రైళ్లు, విమానాలు తన సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు. ఆగిపోయిన పెళ్లిళ్లకు సాయం చేశారు. పేద రైతుకు ట్రాక్టర్ వచ్చేలా చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సోనూ సాయం అందించారు.
అక్షయ్ భారీ విరాళం
వెండితెరపై తనదైన నటన, యాక్షన్‌తో అలరిస్తున్న నటుడు అక్షయ్ కుమార్. కరోనా వేళ భారీ విరాళం ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పీఎం కేర్స్‌కు రూ.25కోట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు. కరోనా కట్టడికి అహర్నిశలు పనిచేసిన ముంబయి పోలీసులకు రూ.2కోట్లు విరాళంగా అందించాడు.
కదిలి వచ్చిన టాలీవుడ్
లాక్‌డౌన్ కాలంలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తమ వంతు సాయం చేశారు. పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్ తదితరులు ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌గా రూ.50 లక్షల చొప్పున ఇవ్వగా, పీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ రూ.3కోట్లు, పవన్ రూ.కోటి అందించారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు రూ.75లక్షలు చొప్పున ఇచ్చారు.
- ఇక కరోనా కారణంగా కుదేలైన చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు అగ్ర కథానాయకులతో పాటు, యువ కథానాయకులు నడుం బిగించారు. ఇందులో భాగం కరోనా క్రైసిస్ పేరిట ఏర్పాటు చేసిన ఛారిటీకి చిరు రూ.కోటి అందించారు. ఈ ఛారిటీలో తెలుగు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు.. తదితరులు భాగస్వాములయ్యారు. అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అనిల్ రావిపూడి, నితిన్, తమన్, ఇలా ప్రతి ఒక్కరూ చేతనైన సాయం చేశారు. చిత్ర పరిశ్రమలో రోజు వారీ వేతనంపై పనిచేసేవారికి నిత్యావసర సరకులు అందించారు.
- లాక్‌డౌన్ కాలంలో పలువురు వలస కార్మికులకు నటుడు ప్రకాశ్‌రాజ్ తన ఫామ్ హౌస్‌లో ఆశ్రయం కల్పించారు. కర్ణాటకలోని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆహారం, నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు తనవంతు సాయం చేశారు.
- నటుడు అల్లరి నరేశ్ తన నాంది చిత్ర యూనిట్‌లో పనిచేసే రోజువారికీ కూలీలైన 50మందికి ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇందులో నిర్మాత సతీశ్ వేగేశ్న భాగస్వామి అయ్యారు.
- లాక్‌డౌన్‌లో యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ వినూత్నంగా సాయం అందించాడు. మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో విరాళాలు సేకరించిన ఆయన 17,723 కుటుంబాలకు రూ.1.71కోట్లు సాయం అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆయన అభిమానులతో పంచుకున్నారు. అదే విధంగా హైదరాబాద్ పోలీస్‌లతో కలిసి కరోనాపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- అన్నార్తులను ఆదుకునేందుకు కథానాయిక ప్రణీత స్వయంగా రంగంలోకి దిగారు. తనన సమక్షంలోనే ఆహార పదార్థాలను తయారు చేయించి, ఆ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
- కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) ఆధ్వర్యంలో 200 పడకల ఆస్పత్రిని అధికారులు సిద్ధం చేశారు. ఈ ఆస్పత్రికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లను బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గణ్ అందించారు. అంతేకాదు, ధారావిలోని 700 కుటుంబాలకు తన ప్రొడక్షన్ హౌస్ నుంచి నిత్యావసర సరకులు అందించారు.
- బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ కూడా తనదైన శైలిలో సాయం చేశారు. షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఉపాధి కోల్పోయిన సుమారు 25వేలమంది సినీ కార్మికులకు నగదు సాయం చేశారు.
- షారుఖ్‌ఖాన్, ఆయన సతీమణి గౌరీఖాన్‌లు తమ నాలుగంతస్తుల ఆఫీస్‌ను కొవిడ్ ఆస్పత్రి, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించుకోవచ్చని బృహన్ ముంబయి అధికారులకు సూచించారు. దీంతో కరోనాకు గురైన మహిళలు, వృద్ధులను అధికారులు ఇక్కడకు తరలించారు. దీంతో పాటు, కరోనా కట్టడికి కృషి చేస్తున్న పోలీసులు, వైద్యులకు 50వేల కిట్‌లను అందించారు. ముంబయిలో 5,500 కుటుంబాలకు రోజూ ఆహారం పంపిణీ చేశారు.
- నటి విద్యాబాలన్ 1000 పీపీఈ కిట్‌లను తన సొంత ఖర్చులతో వైద్యులకు అందించారు. అదే విధంగా విరాళాల ద్వారా సేకరించిన సొమ్ముతో మరో 1000 కిట్లు కొనుగోలు చేశారు.
- లాక్‌డౌన్‌లో రోజు వారీ కూలీల ఆకలిని తీర్చేందుకు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓ ఎన్‌జీవో కలిసి భోజనాన్ని అందించారు. అదే విధంగా షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయిన 100మంది డ్యాన్సర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.
- అగ్ర కథానాయకుడు రజనీకాంత్ రూ.50లక్షలను ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్‌కు అందించారు.
కేవలం సిలబ్రిటీలు మాత్రమే కాదు, ఎంతో మంది సామాన్యలు సైతం కరోనా వేళ తోటివారిని ఆదుకున్నారు. స్థానిక ఎన్జీవోలు పోలీసులతో కలిసి పేదల ఆకలి తీర్చారు.
ఇదీ చూడండి : సోనూసూద్ దాతృత్వం.. కూలీల కోసం ఏకంగా విమానం